ఇంద్రవెల్లి: అగ్ని ప్రమాదంలో జొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలోని హర్కపూర్‌తండా గ్రామంలో జరిగింది. రైతు ఆడే విఠల్, సర్పంచ్ రాథోడ్ రోహిదాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పక్క చేనులో అగ్గి పెట్టగా మంటలు వ్యాపించి కోసి కుప్ప పెట్టిన జొన్న పంటకు అంటుకున్నాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో జొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. సుమారు 20 క్వింటాళ్ల జొన్న పంట కాలిపోయిందని రైతు వాపోయాడు. రెవెన్యూ అధికారులు కాలిపోయిన పంటను పరిశీలించి ప్రభుత్వం నుంచి పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.


