సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ‘సర్’కు రంగం సిద్ధమైంది. మూడో విడత రాష్ట్రంలో వచ్చే నెల 14నుంచి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 25నుంచి జూలై 24వరకు ఇంటింటికీ బీఎల్‌వో(బూత్ లెవల్ అధికారులు) సర్వే చేసి నిర్ధారణ చేయనున్నారు. కొత్తగా 18ఏళ్లు అక్టోబర్ ఒకటో తేదీ వరకు నిండిన వారందరికీ నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఇవన్నీ సమగ్రంగా రూపొందించాక తుది ఓటర్ల జాబితా రూపొందిస్తారు. జిల్లాలో మూడు ప్రధాన నియోజకవర్గాలైన మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లితోపాటు ఖానాపూర్ పరిధిలో ని జన్నారం మండలం ఉంది. ప్రధాన నియోజవకర్గాల్లో బీఎల్‌వోలు 747 మంది ఉన్నారు. జన్నారం మండలంలో 44వేల ఓటర్లు ఉండగా, ఇక్కడ 53మంది బీఎల్‌వోలు ఉన్నారు. వీరంతా ఇంటింటికీ తిరిగి ఓటర్లకు ఓ ఫాం ఇచ్చి పరిశీలించి ఈ మేరకు ఓటరు జాబితా రూపొందిస్తారు. ఇప్పటికే ఓటరు కుటుంబాలతో పోల్చడం మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇంకా చాలామంది చిరునామాలు దొరక్క మ్యాపింగ్ పూర్తి కావడం లేదు. వీరంతా స్థానికంగా లేని ఓటర్లా? అనేది ఇంటింటి ఓటరు సర్వేతో బయటపడనుంది.
బోగస్ ఓట్ల ఏరివేత
సమగ్ర ఓటరు సవరణతో అర్హులు మాత్రమే ఓటర్లుగా ఉండే అవకాశం ఉంది. జిల్లాలో చాలామందికి రెండేసి ఓట్లు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో కొందరు ఏళ్ల క్రితమే శాశ్వతంగా వలస వెళ్లినప్పటికీ ఇక్కడే ఓటు కొనసాగుతోంది. ఇంకా మరణించినవి కూడా తొలగించలేదు. దీంతో అడ్డగోలుగా బోగస్ ఓటర్లు ఉన్నారు. ఓటరు మ్యాపింగ్ సమయంలో చాలాచోట్ల ఓటర్ల జాబితా లో ఆయా చిరునామాల్లో స్థానికంగా లేరు. వీరికి సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. వీరంతా సమగ్ర సర్వేలో స్థానికంగా ఉన్నట్లు గుర్తింపు కార్డు చూపితే ఓటు కొనసాగుతుంది. లేకపోతే తొలగిస్తారు. జిల్లాలో ఓటరు మ్యాపింగ్ ఇప్పటికీ 70.32శాతమే పూర్తయింది. మరోవైపు ‘సర్’కు షెడ్యూల్ విడుదల కాగా, పూర్తి కాని చోట్ల ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఓట్ల సవరణలో వివాదం నెలకొనడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ప్రతీ బూత్ స్థాయిలో ఓ కార్యకర్తను జిల్లా వ్యాప్తంగా 747 మందిని నియమించి క్షేత్రస్థాయిలో పరిశీలించేలా ఏర్పాట్లు చేసింది.
జిల్లా ఓటర్లు
మొత్తం ఓటర్లు 6,67,488
మ్యాపింగ్ పూర్తి 4.73లక్షలు
పూర్తయిన శాతం 70.32శాతం
బీఎల్‌వోలు 747మంది


