‘ఉపాధి’ కూలీల హాజరు మెరుగు | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కూలీల హాజరు మెరుగు

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

● ముమ్మరంగా సాగుతున్న పనులు ● రాష్ట్రంలో మొదటి ఎనిమిది స్థానాల్లో జిల్లా

దండేపల్లి: జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం పొలాల పనులు పూర్తి కావడంతో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీల హాజరు రోజు రోజుకు మెరుగుపడుతోంది. జిల్లాలోని 16 మండలాల్లో ఉన్న 305 గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం చెరువుల పూడికతీత, ఫిష్‌పాండ్స్‌, ట్రెంచ్‌ తవ్వకాల పనులు సాగుతున్నాయి. ఈ నెల 14న హాజరు శాతం పరిశీలిస్తే.. జిల్లాలోని భీమిని మండలంలో అత్యధిక మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్లారు. గ్రామానికో 200 మందికి పైగా.. కన్నెపల్లి, భీమారం, బెల్లంపల్లి, కోటపల్లి, మందమర్రి మండలాల్లో ఒక్కో గ్రామానికి వంద మందికి పైగా పనులకు హాజరయ్యారు. పారిశ్రామిక ప్రాంతాల్లోనూ కూలీల హాజరు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ ప్రతీ గ్రామంలో 80నుంచి 100 మంది వరకు కూలీలు హాజరవుతున్నారు. జిల్లాలో హాజరు శాతం మెరుగవడంతో వారం రోజులుగా జిల్లా రాష్ట్రంలో 5 నుంచి 8వ స్థానాల మధ్య నిలుస్తోంది. ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూలీలు ఉదయమే పని ప్రదేశాలకు చేరుకుని పనులు చేస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 30,225 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. యాసంగిలో రైతులు సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలు చేతికి రావడంతో రైతులు ధాన్యం అమ్మే పనిలో ఉన్నారు. దీంతో రైతులు, రైతు కూలీలకు వ్యవసాయ పనులంటూ ఏమి లేకపోవడంతో ఉపాధి పనుల బాటపట్టారు.

సమయపాలన పాటించాలి..

ఉపాధి కూలీలు సమయపాలన పాటించాలి. ఉదయం 6గంటల వరకే పని ప్రదేశాలకు చేరుకోవాలి. వీలైతే ఇంకో అరగంట ముందే చేరుకుంటే అరగంట ముందు ఇంటికి రావచ్చు. ఉదయం 10గంటల నుంచి 11గంటల మధ్య ఇంటికి చేరుకోవాలి. ఇలా సమయపాలన పాటిస్తే కూలి గిట్టుబాటవుతుంది. ఎండ తీవ్రత ఉండదు. కూలీలు ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి.

– కిషన్‌, డీఆర్‌డీవో

Advertisement
 
Advertisement
Advertisement