లింగాపూర్: సిర్పూర్(యూ) మండలంలోని శెట్టిహాడప్నూర్ గ్రామపంచాయతీ పరిధికి చెందిన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ‘రేలా’ పాటల కళాకారిణి కనక రాంబాయి (80) వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతూ గురువారం తెల్లవా రుజామున కన్నుమూశారు. ఆమె మృతి ఆదివాసీ సమాజానికి, ముఖ్యంగా రేలా పాటల కళారంగానికి తీరని లోటు. గ్రామీణ వివా హాలు, దేవతల పూజా కార్యక్రమాలు జాతరలు, సామాజిక వేడుకల్లో రేలా పాటలతో ఆందరినీ ఆలరించి రాంబాయి ప్రత్యేక గుర్తింపు పొందారు. తన జీవితంలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేసిన ఆమె భావితరాలకూ రేలా పాటలు అందించాలని సంకల్పించారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాంబాయి మృతితో కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె అంత్యక్రియలు గురువారం సాయంత్రం శెట్టిహాడప్నూర్ గ్రామ సమీపంలోగల రాజులగూడలోని తన వ్యవసాయ భూమిలో నిర్వహించారు.


