మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పంటలకు ధరలు పెంచుతూ రైతులకు తీపి కబురు అందించింది. 2026–27 ఖరీఫ్‌లో 14 రకాల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంచుతూ బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాలో పత్తి, వరి పంటలు అధికంగా సాగవుతుండగా.. పెంచిన ధరలు పత్తి పంటకు కాస్త ఊరటనిస్తోంది. వరి ధాన్యం ధర రైతులను నిరాశకు గురిచేస్తోంది. ఆ తర్వాత స్థానంలో సాగవుతున్న కంది, మొక్కజొన్న, పెసర పంటలకు నామమాత్రమే పెంపు ఉండగా నిరాశపరుస్తోంది. జిల్లాలో 3.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఆశించిన స్థాయిలో మద్దతు ధరలు పెంచకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. అధికంగా పత్తి, పొద్దుతిరుగుడు, నువ్వు పంటలకు పెంచారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్(సీఏసీపీ) సూచించిన ధరలు సాగుకయ్యే ఖర్చు కన్నా తక్కువగానే ఉన్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు అనుగుణంగా ధరలు పెంచాలని గత కొద్ది రోజుల క్రితం సీఏసీపీకి విజ్ఞప్తి చేశారు. రైతు కమిటీల సిఫారసుల ప్రకారం సాగుకు చేసే ఖర్చుకు అదనంగా మరో 50శాతం కలిపి ధర ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. పత్తి, కంది పంటలకు క్వింటాల్‌కు రూ.10 వేలు, వరి, మొక్కజొన్న పంటలకు రూ.3 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఏటేటా పెరుగుతున్న పెట్టుబడి..
ఏటేటా సాగు వ్యయం రెట్టింపు అవుతోంది. పెట్టుబడి, రాబడికి పొంతన లేని దుస్థితి ఏర్పడుతోంది. ఏటా పెరుగుతున్న పెట్టుబడి వ్యయం రైతులను అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేస్తోంది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వం చిన్నచూపుతో పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులకు సాగు భరోసా లేకుండా పోతోంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు, కూ లీ ధరలు, వ్యవసాయ యంత్రాల ధరలు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. ఎకరం వరి సాగుకు పెట్టుబడి రూ.30వేలు, పత్తికి రూ.40 నుంచి రూ.45వేలు, కందికి రూ.30వేలు, సోయాబీన్ రూ.20 నుంచి రూ.25వేలు, మొక్కజొన్న రూ.20 వేల వరకు వ్యయమవుతోంది. దీంతో ఈ ఏడాదైనా పత్తి క్వింటాల్‌కు రూ.10వేలు, వరికి రూ.3వేల వరకు మద్దతు ధర చెల్లించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెట్టుబడికి బ్యాంకు రుణాలు అందక అప్పు చేసి నష్టపోతున్నారు. జిల్లాలో 1.60లక్షల మంది సన్న, చిన్నకారు, కౌలు రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. 75శాతం వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నారు. గత ఏడాది భారీ వర్షాలు, వరదలతో నష్టపోయారు. కనీసం కొద్దిపాటి దిగుబడి వచ్చిన పంటలకు మద్దతు ధరతో ప్రభుత్వం రైతులకు అండగా నిలువడం లేదని వాపోతున్నారు.


