పట్టుబట్టి ఐఎఫ్‌ఎస్‌ సాధించి.. | - | Sakshi
Sakshi News home page

పట్టుబట్టి ఐఎఫ్‌ఎస్‌ సాధించి..

May 15 2026 12:37 PM | Updated on May 15 2026 12:37 PM

● రాష్ట్ర స్థాయిలో శశాంక్‌కు తొలి ర్యాంకు ● రైతు కుటుంబం నుంచి అత్యుత్తమ స్థాయికి..

జైపూర్‌: బీటెక్‌ చదువుతున్న క్రమంలో స్నేహితుడి తండ్రి వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన అతడిని కదిలించింది. రైతు ఆత్మహత్యలు ఉండకూడదని, ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనే నిర్ణయం సివిల్స్‌ వైపు నడిపించింది. మండలంలోని కుందారం గ్రామానికి చెందిన దహగామ శశాంక్‌ సివిల్స్‌లో రెండుసార్లు విఫలమైనా నిరాశ చెందలేదు. పట్టుబట్టి ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌(ఐఎఫ్‌ఎస్‌)–2025 ఫలితాల్లో ఆల్‌ ఇండియా 78వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. రైతు కుటుంబం నుంచి వచ్చినా పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు. మండలంలోని కుందారం గ్రామానికి చెందిన దహగామ ఉమామహేశ్వర్‌ పర్యావరణవేత్త, రైతు, తల్లి నాగలక్ష్మి న్యాయవాదిగా పని చేస్తున్నారు. సమాజ సేవ కోసం ఉమామహేశ్వర్‌, నాగలక్ష్మి నాలుగు దశాబ్దాల క్రితం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో నివాసం ఏర్పర్చుకున్నారు. వీరి చిన్న కుమారుడు శశాంక్‌ పదో తరగతి వరకు ఎన్టీపీసీలోని గౌతంమోడల్‌ స్కూల్‌, ఇంటర్మీడియెట్‌ చుక్కరామయ్య కాలేజీలో, జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో బీటెక్‌, అండ్‌ ఎంటెక్‌ ఏకకాలంలో పూర్తి చేశాడు. విద్యార్థి దశ నుంచే ప్రజాసేవపై ఆసక్తి పెంచుకున్న శశాంక్‌ జీఆర్‌ఈ(జీఎంఏటీ) పరీక్షల్లో 99శాతం ఉత్తీర్ణత సాధించినా విదేశాల్లో ఉన్నత విద్యను ఎంచుకోకుండా యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ వైపు అడుగులు వేశాడు. రెండు సార్లు సివిల్‌ సర్వీసెస్‌లో ప్రిలిమ్స్‌ చేరుకున్నా సాధించకపోవడంతో ఐఎఫ్‌ఎస్‌పై దృష్టి సారించాడు. దేశవ్యాప్తంగా 9.4లక్షల మంది అభ్యర్థులు యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోగా 2,116మంది పరీక్షల్లో అర్హత సాధించారు. వీరిలో 372మంది ఇంటర్వ్యూకు ఎంపిక కాగా 148మంది మాత్రమే ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఇందులో శశాంక్‌ దేశవ్యాప్తంగా 78వ ర్యాంకు, రాష్ట్రంలో తొలి స్థానంలో చోటు దక్కించుకోవడం గమనార్హం. శశాంక్‌ను రాష్ట్ర లాండ్‌ఆర్డర్‌ డీజీపీ మహేశ్‌ భగవత్‌ శాలువాతో సత్కరించి అభినందించారు.

ప్రజాసేవే లక్ష్యం..

ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో యూపీఎస్సీ పరీక్షలు సిద్ధమయ్యాను. తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. అడవుల సంరక్షణ, పర్యావరణాన్ని కాపాడుతూ భూగర్భజలాల సంరక్షణకు కృషి చేస్తా. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంతటి అత్యుత్తమ స్థాయికి రాణించాను.

– శశాంక్‌

Advertisement
 
Advertisement
Advertisement