మంచిర్యాలరూరల్(హాజీపూర్): ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా జరగాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట, ముల్కల్ల, హాజీపూర్ మండలం రాపల్లిలోని కొనుగోలు కేంద్రాలను బుధవారం సందర్శించారు. ధాన్యం నిల్వలు, తేమశాతం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాలకు పంట నష్టం జరగకుండా గోదాముల్లో నిల్వ చేసి కేటాయించిన మేరకు రైస్ మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరిపి మద్దతు ధర ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట గిర్దావర్‌లు ప్రభు, నిర్వాహకులు, రైతులు ఉన్నారు.


