మంచిర్యాలటౌన్: జిల్లాలో ఈ నెల 11 నుంచి జనగణన 2027 ప్రారంభించారు. మూడు రోజులపాటు ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన బ్లాక్‌ల వారీగా ఇంటింటికీ నంబరింగ్ ఇచ్చారు. వారి పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో మ్యాప్ చేస్తూ, గుర్తించిన ఇళ్లకు సెన్సెస్ హౌస్ నంబరింగ్ చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1,750 బ్లాక్‌లను గుర్తించగా, ఒక్కో బ్లాక్‌లో 180 నుంచి 200 ఇళ్ల వరకు ఉన్నాయి. గృహ సర్వే కోసం 1,572 మంది ఎన్యుమరేటర్లు ఉండగా, వారిపై పర్యవేక్షణ కోసం 276 మంది సూపర్‌వైజర్లను నియమించారు. వీరి సమక్షంలో ఈ నెల 14 నుంచి ఇంటింటికీ వెళ్లి జనగణన చేపట్టనున్నారు. జూన్ 10వ తేదీలోగా మొదటి దశ పూర్తి చేయనున్నారు. ఈ నెల 10 వరకు జిల్లాలో 8,700ల మంది సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇంటింటికీ వచ్చే ఎన్యుమరేటర్లకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వారికి వచ్చిన హెచ్‌తో ప్రారంభమయ్యే 11 అంకెల ఎన్యుమరేషన్ ఐడీని ఇస్తే సరిపోతుంది. ఆ ఐడీ ప్రకారంగానే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల ద్వారా కుటుంబ వివరాలను ధృవీకరిస్తారు. జనగణన ప్రక్రియ మొత్తం కాగిత రహితంగానే, పూర్తి డిజిటల్ విధానంలో చేయనున్నారు.
మ్యాపింగ్‌లో ప్రతీ ఇల్లు నమోదు
జనగణన ప్రక్రియ మొదటి దశలో భాగంగా ప్రతీ ఇంటిని, ప్రతీ కుటుంబాన్ని లెక్కించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ నెల 11 నుంచి 13 వరకు ఎన్యుమరేటర్లకు మ్యాపింగ్ చేపట్టే విధులు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇళ్లను 1,750 బ్లాక్‌లుగా విభజించి ఎన్యుమరేటర్లకు ఇవ్వగా వారి గైడ్ కోసం డిజిటల్ మ్యాప్‌లను అందించారు. గూగుల్ ఆధారంగా సేకరించిన ల్యాండ్ మార్కులు, వీధుల వివరాలు, ఇతరత్రా కట్టడాలు, రోడ్లు ఇలా అన్నింటినీ సరిచూసుకుంటూ వారికి ఇచ్చిన మ్యాప్‌లోని ప్రతీ ఇంటికి సెన్సెస్ హౌస్ నంబరింగ్ చేశారు. డిజిటల్ మ్యాప్‌కు ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలు సరిపోల్చుతూ, మ్యాప్‌లో లేని అంశాలను నోట్ చేస్తూ మూడు రోజుల పాటు మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టారు. డిజిటల్ మ్యాప్ లేటెస్ట్‌ది కాకపోవడంతో, కొత్తగా కొన్ని ఇళ్లు, వీధులు నూతన మ్యాపింగ్ ప్రక్రియలో ఎన్యుమరేటర్లు గుర్తించారు. ప్రస్తుతం ఎన్యుమటరేటర్లు గుర్తించిన మ్యాపింగ్ ప్రకారం వారి పరిధిలో ఎంత ఏరియా ఉంది, ఎన్ని గృహాలు ఉన్నాయో పూర్తిగా నమోదు చేసుకున్నారు. మూడు రోజుల పాటు జరిగిన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నెల 14 నుంచి నిజమైన ఇంటింటి గృహ సర్వే ప్రారంభించి, జూన్ 10 వరకు పూర్తి చేయనున్నారు.
ప్రజలు సహకరించాలి
జనగణనకు సంబంధించి హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, మ్యాపింగ్ పూర్తయ్యింది. ఇక ఇంటింటికీ వెళ్లి, ఇంటి యజమానితో పాటు, 33 రకాల ప్రశ్నలను అడిగి వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు. అంతా డిజిటల్ విధానంలోనే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వారు హెచ్ అక్షరంతో మొదలైన 11 అంకెల ఎన్యుమరేషన్ ఐడీని ఎన్యుమరేటర్లకు చెబితే సరిపోతుంది. ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలి.
– పాపయ్య, సీపీవో, మంచిర్యాల
జనగణన 2027లో మొదటి దశనే ఎంతో కీలకంగా మారనుంది. ప్రతీ ఇంటిని, ప్రతీ కుటుంబాన్ని ఈ గణనలో నమోదు చేయాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో మొదటి మూడు రోజుల పాటు ఒక్కో ఎన్యుమరేటర్‌కు కేటాయించిన పరిధిలో ఎన్ని ఇళ్లు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో హౌస్ లిస్టింగ్‌తో కూడిన మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేశారు. జిల్లాలో సమగ్ర గృహ సర్వే నిష్పక్షపాతంగా, ఖచ్చితంగా సాగేందుకు ఎన్యుమరేటర్లు చేస్తున్న మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు స్వయంగా పరిశీలించి సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. ఇళ్లు, కుటుంబాల గణనను మొదటి దశలో 33 అంశాలతో కూడిన ప్రశ్నావళితో పూర్తి చేయనున్నారు. రెండో దశ 2027 ఫిబ్రవరి 9 నుంచి 25 వరకు వ్యక్తిగత వివరాల సేకరణ చేపట్టడంతో పూర్తికానుంది.


