బెల్లంపల్లి/నస్పూర్: పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి బుధవారం మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. 4,600 మంది విద్యార్థులకు గానూ 4,327 మంది హాజరుకాగా 273 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 94.07గా నమోదైనట్లు బెల్లంపల్లి ప్ర భుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్ష నిర్వహణ కోఆర్డినేటర్, మెంటార్ ఎం.దేవేందర్ తెలిపారు. బెల్లంపల్లిలోని 4 పరీక్ష కేంద్రాల్లో 1,171 మందికి గానూ 1,119 మంది హా జరుకాగా 52 మంది గైర్హాజరయ్యారు. మంచిర్యాలలో 8 పరీక్ష కేంద్రాల్లో 2,365 మంది విద్యార్థులకు గానూ 2,206 మంది హాజరుకాగా 159 మంది గైర్హాజరయ్యారు. కుమురంభీం ఆసిఫాబాద్‌లో 4 పరీక్ష కేంద్రాల్లో 1,064 మంది విద్యార్థులకుగానూ 1,002 మంది హాజరుకాగా 62 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షల నిర్వహణను ప్రత్యేక పరిశీలకుడు ఎ.కాంతయ్య పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తులు
మంచిర్యాలటౌన్: 2026–27 విద్యాసంవత్సరానికి గానూ హైదరాబాద్‌లోని పబ్లిక్ స్కూల్‌లో ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అర్హులైన బాలురకు 3, బాలికలకు 3 సీట్లు కేటాయించడం జరిగిందని, జూన్ 1, 2019 నుంచి మే 31, 2020 మధ్య జన్మించినవారు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలన్నారు. ఆసక్తి కలవారు దరఖాస్తుతో పాటు బోనఫైడ్, తహసీల్దార్ జారీ చేసిన కుల, ఆదాయ, జననం, నివాస ధ్రువీకరణ పత్రాలు జతచేయాలన్నారు. గిరిజనులలో ఉపతెగల వారీగా సీట్లు కేటాయించడం జరిగిందని, గోండు, నాయక్ పోడ్ తెగలకు 2, కొలాం, కోయ, లంబాడా/సుగాలి, ఇతర తెగల వారికి ఒక్కొక్క సీటు కేటాయించినట్లు తెలిపారు. అర్హులైనవారు ఈ నెల 18లోగా జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలోని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈ నెల 22 న డ్రా పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.


