దిలావర్‌పూర్: మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన కదిలే పాపహరీశ్వర ఆలయ ప్రాంగణంలో 11 నుంచి 13వ శతాబ్దాల మధ్యకాలానికి చెందిన అద్భుతమైన నటరాజ రూప తాండవ శివుని శిల్పాన్ని గుర్తించినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డా.తుమ్మల దేవరావు బుధవారం తెలిపారు. ఈ శిల్పం శైవ శిల్పకళలో అరుదైన కళాఖండంగా నిలుస్తుందన్నారు. లలితముద్రలో ఆనంద తాండవం చేస్తున్న శివుని రూపం ఈ విగ్రహంలో అత్యంత సుందరంగా ప్రతిఫలించింది. విగ్రహానికి బహుభుజాలు ఉండగా, పై కుడి చేతిలో మరుకం, పై ఎడమ చేతిలో అగ్ని, కింది కుడి చేతిలో అభయముద్ర, కింది ఎడమ చేతిలో గజహస్త ముద్రలు చెక్కి ఉన్నాయి. తలపై అద్భుతమైన జటాజూటం మలచబడగా, అందులో గంగా, చంద్రుడు, సర్పాలు సుందరంగా ప్రతిష్ఠించబడ్డాయి. మెడలో హారాలు, కటి సూత్రం, చెవులకు పుష్పాభరణాలు, సర్పాల అలంకరణలు శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మెడ వెనుక భాగంలో అనుచర గణాల రూపాలు కూడా చెక్కి ఉన్నాయి. ఈ విగ్రహం కుడికాలిపై నిలబడి, ఎడమ కాలును ఎత్తి నృత్యం చేస్తున్న భంగిమలో కనిపిస్తుంది. ఒకవైపు లాస్య సౌందర్యం, మరోవైపు ఉగ్రరూప భావవ్యక్తీకరణ కలగలిపిన తీరు శిల్పానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కపాలాల రూపకల్పన ద్వారా శిల్పి శైవ తత్వంలోని రౌద్ర –ఆనంద స్వరూపాలను ప్రతిబింబించినట్లు తెలుస్తోంది. కల్యాణి చాళుక్యుల చివరి దశలో లేదా కాకతీయుల ప్రారంభ కాలంలో ఈ అపురూపమైన నటరాజ శిల్పాన్ని మలచి ఉండవచ్చని తుమ్మల దేవరావు అభిప్రాయపడ్డారు.


