ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 11న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం మావల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మావల గ్రామానికి చెందిన బర్కుంటి శివన్న (52) పద్మనాయక గార్డెన్ రోడ్ సమీపంలో హత్యకు గురి కాగా ఆయన కుమారుడు విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మావల సీఐ కర్రె స్వామి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటన స్థలంలో హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలతో ఉన్న రాయి, కొడవలి, రక్తపు ఆనవాళ్లు ఉన్న మట్టిని స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన నల్లావార్ పోశెట్టి హత్యకు ముందు మృతుడితో ఉన్నట్లు గుర్తించారు. మే 12న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆయన వద్ద నుంచి రక్తపు మరకలతో ఉన్న చొక్కా, తువ్వాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇద్దరు కలిసి స్క్రాప్ సేకరణ పనులు చేస్తూ తరచూ డబ్బుల పంపకం, బీడీల దొంగతనం విషయాల్లో గొడవపడేవారని తేలింది. స్క్రాప్ వ్యాపారాన్ని ఒంటరిగా నిర్వహించాలనే ఉద్దేశంతో నిందితుడు మద్యం మత్తులో ఉన్న శివన్నపై రాయితో దాడి చేసి హత్య చేశాడు. పోశెట్టిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, సీఐ కర్రె స్వామి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


