మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తరచుగా నడిచే ఎక్స్‌ప్రెస్ బస్సులను కుదించడం వల్ల ప్రయాణం కష్టంగా మారింది. బస్సుల సంఖ్య తగ్గడంతో రద్దీ పెరిగి సీట్లు దొరకక చాలామంది నిల్చునే పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో గంటలపాటు వేచి చూడాల్సి వస్తోంది. బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత మహిళల సంఖ్య రెట్టింపైంది. బస్సుల సంఖ్యను మాత్రం తగ్గించడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి.
హైదరాబాద్‌కు రెండే బస్సులు
మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత పల్లెవెలుగు(ఆర్డీనరీ), ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ముందు నాలుగు బస్సులు హైదరాబాద్‌కు నడిపేవారు. ఉదయం 4గంటలకు, సాయంత్రం 4.30, రాత్రి 7.30, 8.30గంటలకు బస్సుల రాకపోకలు సాగించాయి. పట్నం వెళ్లే ఏ బస్సులో చూసినా ప్రయాణికుల సంఖ్య రెట్టింపుగా ఉండేది. ఉదయం 4గంటల బస్సుకు సీట్ల కోసం మంచిర్యాల బస్‌స్టేషన్‌కు ప్రయాణికులు 3.30గంటలకు వచ్చేవారంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. లగ్జరీ, లహరీ బస్సుల కంటే ఈ బస్సుల్లోనే మహిళలు ప్రయాణించేవారు. ఇటీవల కాలంలో ఉదయం 4గంటలు, సాయంత్రం 4.30గంటలకు బస్సులను పూర్తిగా రద్దు చేసి రెండింటికి పరిమితం చేశారు. 200 కిలోమీటర్ల దూరానికి ఎక్స్‌ప్రెస్ బస్సులను రద్దు చేయాలనే ఆలోచనతో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే మిగతా బస్సులు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అందుబాటులోనే బస్సులు
ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు లగ్జరీ, లహరి, రాజధాని బస్సులు 38 నడుస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులను గ్రామీణ ప్రయాణికుల కోసం ఉపయోగిస్తున్నాం. గోదావరిఖని, కరీంనగర్ నుంచి ఎన్నో బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రెండు బస్సులు నడుస్తున్నాయి. – శ్రీనివాసులు, డీఎం, మంచిర్యాల
ప్రయాణికులపై ప్రభావం
మంచిర్యాల నుంచి హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గడంతో సమయం ఎక్కువ పడుతుంది. నేరుగా సర్వీసులు లేకపోవడం వల్ల గోదావరిఖని, కరీంనగర్‌కు వెళ్లి బస్సులు మారాల్సి రావడంతో ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు కష్టాలు ఎదురవుతున్నాయి. మంచిర్యాల నుంచి హైదరాబాద్ మార్గంలో బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.


