లక్ష్మణచాంద: ప్రమాదవశాత్తు నిప్పంటుకుని రైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల మేరకు కనకాపూర్‌కు చెందిన మంద గంగన్న (56) మంగళవారం ఉదయం తన చేనులోని మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న రైతు వరి పంట వ్యాపించాయి. దీంతో తన అన్న కుమారుడికి ఫోన్ చేసి విషయం చెప్పి త్వరగా రమ్మన్నాడు. మంటలు ఎక్కువ కావడంతో భయాందోళన చెందిన రైతు ఆర్పివేసే క్రమంలో ఒడ్డుపై నుంచి జారి కిందపడడంతో నిప్పంటుకుని మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న అతని సోదరుని కుమారుడు జనార్దన్ పోలీసులకు సమాచారం అందించాడు. నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఎస్సై శ్రావణి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


