వేమనపల్లి: తెలంగాణ రాష్ట్ర కుల గణన గెజిట్‌లో నేతానిగా ఉన్న గెజిట్‌ను నేతకానిగా మార్చాలని కోరుతూ తెలంగాణ నేతకాని మహర్ సేవా సంఘం నాయకులు మంగళవారం మంత్రి వివేక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పొరపాటుగా జరిగిన తప్పిదం తమ కులానికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఐకేపీలో ఎస్సీ కులానికి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నేతకాని మహర్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి సోదరి తిరుపతి, ఎన్‌ఎస్‌ఎఫ్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు మల్లేశ్ కొటారి, రాష్ట్ర నాయకులు విశ్వనాథ్, దాగం మల్లేశ్, తదితరులు ఉన్నారు.
రైతు కూతురు డాక్టర్
నెన్నెల: మండలంలోని జెండావెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు ఏస్కూరి అంకయ్య కూతురు మంజూష మంగళవారం సూర్యాపేటలో ఎంబీబీఎస్ పట్టా తీసుకుంది. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి తనకు ఆసరాగా నిలిచేది విద్య ఒక్కటేనని గుర్తించి ఉన్నత విద్య లక్ష్యంగా కష్టపడి చదివి అనుకున్నది సాధించానని పేర్కొంది. మూడో తరగతి వరకు ఆదిల్‌పేట ఆదర్శ విద్యాలయంలో, 4 నుంచి పదోతరగతి వరకు మందమర్రి కార్మెల్ స్కూల్‌లో, ఇంటర్ గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో పూర్తి చేసింది. నీట్‌లో మంచి ర్యాంకు రావడంతో సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. 70 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తానని మంజూష పేర్కొంది.
మెడికల్ బోర్డు నిర్వహణకు యాజమాన్యం హామీ
నస్పూర్: గత కొన్ని నెలలుగా నిలిచి పోయిన మెడికల్ బోర్డును నెలలోగా నిర్వహిస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గుర్తింపు సంఘం నాయకులతో డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పొట్రుతో జరిగిన సమావేశ వివరాలను వెల్లడించారు. కార్మికుల పలు పెండింగ్ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సొంతింటి పథకం, పెర్క్స్‌పై ట్యాక్స్ రద్దుపై స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించి అమలు చేస్తామని, పెండింగ్‌లో ఉన్న 337 మందికి పైగా డిపెండెంట్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, గోల్డెన్ హ్యాండ్ షేక్, వీఆర్‌ఎస్ వంటివి అమలు చేయబోమని, తదితర సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిందన్నారు. సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య, తదితరులు పాల్గొన్నారు.


