ఇంద్రవెల్లి: హీరపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. అంతకు ముందు జీపీ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు. అనంతరం ప్రజావాణిలో వచ్చిన 230 దరఖాస్తుల ఆధారంగా రైతుల పంటచేలలో సర్వే నిర్వహించారు. బోర్లు, బావులు, విద్యుత్ సౌకర్యం ఉన్న, లేని పంటచేలను గుర్తించారు. 35 మంది రైతుల పంటచేలలో బోర్లు, బావులతో పాటు విద్యుత్ సౌకర్యం ఉందని, 185 మంది రైతుల చేలకు విద్యుత్ సౌకర్యం, బోర్లు, బావులు లేవని నిర్ధారించారు. అర్హులైన రైతులకు సోలార్ పంప్ సెట్లు, బోరు బావులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాథోడ్ గణేశ్, విద్యుత్ శాఖ ఏఈ జాదవ్ రోహిదాస్, సర్పంచ్ తొడసం లక్ష్మీనాగోరావ్, పంచాయతీ కార్యదర్శి రజినీకాంత్, ఏఈవో సురేష్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.


