మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఇంటర్మీడియెట్ అడ్మిషన్లపై దృష్టి సారించింది. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మే 12నుంచి 31వరకు కాలేజీలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30తో మొదటి విడత అడ్మిషన్లు ముగియనున్నాయి. జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 97.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆయా కళాశాలల అధ్యాపకులు ఇదివరకే ఇంటింటా తిరిగి విద్యార్థుల నవివరాలు సేకరించి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ కళాశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రచారం చేశారు.
జిల్లాలో 10 ప్రభుత్వ కళాశాలలు
జిల్లాలో మంచిర్యాల, మందమర్రి, కాసిపేట, చెన్నూర్, బెల్లంపల్లి(బాలికలు), బెల్లంపల్లి, జైపూర్, జన్నారం, లక్సెట్టిపేట, లక్సెట్టిపేట(బాలురు)లో ప్రభుత్వ కళాశాలలున్నాయి. ఒక్కో సెక్షన్‌లో 44 మందినే చేర్చుకోవాలి. ఒక్కో కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌ల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తారు. రెండు మాధ్యమాల్లో కలిపి ఒక్కో గ్రూప్‌లో 88 సీట్ల చొప్పున మొత్తం 352 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. అదనపు సెక్షన్ ఏర్పాటు చేయాలంటే ముందుగా బోర్డు అనుమతి తప్పనిసరి. అడ్మిషన్లు పూర్తిగా ఎస్‌ఎస్‌సీ మార్కుల ఆధారంగా ఇవ్వాలని, ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల ఆధార్ నంబర్ తప్పనిసరిగా పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు అనుబంధిత(అఫిలియేటెడ్) కాలేజీల్లోనే అడ్మిషన్లు పొందాలని సూచించింది.
నిబంధనలు పాటించాల్సిందే..
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి. ప్రైవేట్ కళాశాలుల పునరుద్ధరణకు దరఖాస్తులు మాత్రమే అందించాయి. అన్ని అనుమతులు బోర్డు పరిశీలనలో ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న కళాశాలకు అఫిలియేషన్ అనుమతులు రెండు, మూడు రోజుల్లో మంజూరయ్యే అవకాశముంది. విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తింపు ఉందా.. లేదా.. అని చూసుకున్న తర్వాతే కళాశాలలో చేరాలి.
– అంజయ్య, డీఐఈవో


