లక్సెట్టిపేట: స్కూటీపై నుంచి కిందపడి ఒకరు మృతి చెందిన ఘటన లక్సెట్టిపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. పట్టణంలోని బాబురావు వాడకు చెందిన జగటాల కమల్(39) ప్రతీరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానానికి ఎలక్ట్రిక్ స్కూటీపై వచ్చి వాకింగ్ చేసి, తిరిగి ఇంటికి వెళ్లేవాడు. రోజు మాదిరిగానే ఆదివారం వాకింగ్ పూర్తిచేసుకుని స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయాడు. ప్రమాదంలో అతని తలకు గాయాలు కాగా స్థానికులు గమనించి వెంటనే లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య అర్చన ఫిర్యాదు మేరకు ఏఎస్సై అన్వర్ కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.
ఆటో బోల్తా పడి మరొకరు..
కడెం: మండలంలోని ఉడుంపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన కథనం ప్రకారం.. లక్సెట్టిపేట్‌కు చెందిన హన్మండ్ల కొమురయ్య (68) కడెంలో తన కూతురు ఇంటికి వెళ్లి, శనివారం ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి సిరికొండ మండలం వాయిపేట్ మహంకాళీ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఉడుంపూర్ సమీపంలో గండి పోచమ్మ ఆలయం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కొమురయ్యను లక్సెట్టిపేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆటోలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారులున్నారు. కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బావిలో పడి ఒకరు..
దస్తురాబాద్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోని గోడిసీర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి భార్య అంజలి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోడిసీర్యాల గ్రామానికి చెందిన పోడెటి మహేందర్ (31)కు కొద్ది రోజుల నుంచి మతి స్థిమితం సరిగా లేదు. ఈ నెల 9న ఇంటి నుంచి బయలు దేరి వెళ్లిన ఆయన రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఓ వ్యవసాయ బావిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.
గుండెపోటుతో ఒకరు..
కడెం: మండలంలోని పెద్దూర్‌కు చెందిన తెలంగాణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట్ల క్రాంతికుమార్ యాదవ్ (42) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.


