చెన్నూర్‌ సమస్యలు పట్టించుకోని మంత్రి | - | Sakshi
Sakshi News home page

చెన్నూర్‌ సమస్యలు పట్టించుకోని మంత్రి

May 11 2026 8:26 AM | Updated on May 11 2026 8:26 AM

● మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

రామకృష్ణాపూర్‌: చెన్నూర్‌ నియోజకవర్గ ప్రజల సమస్యలను మంత్రి వివేక్‌ వెంకటస్వామి పూర్తిగా గాలికి వదిలేశారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆరోపించారు. బెయిల్‌ షరతుల మేరకు ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ మంత్రి, అధికారులు స్పందించటం లేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన తండ్రి కోవిడ్‌ సమయంలో వెంటిలేటర్‌పై ఉన్నప్పటికీ కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించి ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న వివేక్‌ జిల్లా రైతుల సమస్యలను పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. అకాల వర్షాలకు మామిడి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారన్నారు. ఇప్పటికై నా మంత్రి, అధికారులు స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌థ్‌పై పోక్సో కేసు నమోదై 36 గంటలు దాటినా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఒక్కటే గనుక ఏ ఒక్క కాంగ్రెస్‌ అగ్రనాయకులు ఈ కేసు విషయమై మాట్లాడడం లేదన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గొడిసెల సంధ్యారాణి, నాయకులు మూల రాజిరెడ్డి, సుదర్శన్‌గౌడ్‌, మేడిపెల్లి సంపత్‌, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement