బెల్లంపల్లి: గంజాయి కేసులో ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్లు తాళ్ల గురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లిలో దాగం రోహిత్ నివాసంలో తనిఖీ చేయగా గంజాయి లభించింది. మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి తన స్నేహితుడైన జుమ్మిడి రాజశేఖర్‌తో కలిసి చుట్టుపక్కల గ్రామాల యువకులకు విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. రాజశేఖర్ నివాసంలోనూ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెరట్లో పెంచుతున్న రెండు గంజాయి మొక్కలను గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 690 గ్రాముల ఎండు గంజాయితో పాటు రెండు మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా జడ్జి రిమాండ్ విధించారు.


