చింతలమానెపల్లి: ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతోంది. రెండు నెలల క్రితం తండ్రి కుబిడె కిష్టయ్య అనా రోగ్యంతో మృతి చెందగా పెద్ద కుమారుడు కుబిడె శ్యాంసుందర్ (27) కుటుంబ బాధ్యతను తీసుకున్నాడు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు సైతం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖర్జెల్లికి చెందిన శ్యాం సుందర్ టైలరింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలోని ఒక శుభకార్యం నేపథ్యంలో మోటార్ సైకిల్‌పై గ్రామానికి బట్టలు తీసుకెళ్లే క్రమంలో బాబాపూర్, నాగెపల్లి గ్రామాల మధ్య బైక్ అదుపుతప్పి గుంతలో పడిపోయింది. యువకుడికి తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య పావని, తల్లి మంగబాయి ఉన్నారు. సోదరుడు సుమియోన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కౌటాల పోలీసులు తెలిపారు.


