‘దాదర్‌’ పట్టాలెక్కేనా? | - | Sakshi
Sakshi News home page

‘దాదర్‌’ పట్టాలెక్కేనా?

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

● అర్ధంతరంగా నిలిపివేసిన రైల్వేశాఖ ● ఏడాదిగా ఇబ్బందుల్లో ప్రయాణికులు ● రైలును పునరుద్ధరించాలని డిమాండ్‌

బెల్లంపల్లి: కాజీపేట–ముంబై మధ్య గతంలో రాకపోకలు సాగించిన దాదర్‌ (ముంబై) వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ (నంబర్‌ 07197/98) రైలును ఏడాది క్రితం అర్ధంతరంగా రద్దు చేశారు. అప్పటినుంచి ఈ రైలు పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. రైల్వేశాఖ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయంతో ముంబైకి వెళ్లడానికి ఉన్న ఒక్కగానొక్క సౌకర్యం కూడా దూరమైంది. కాజీపేట నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్ల మధ్యలోని ప్రయాణికులకు దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు నాసిక్‌ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోలేని ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్వేశాఖ ఎప్పటికప్పుడు అర్ధంతరంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరిస్తూ, కొత్త రైళ్లను ప్రవేశ పెడుతూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటుండగా దాదర్‌ వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందనే ఆరోపణలున్నాయి.

పునరుద్ధరణకు మీనమేషాలు

దాదర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించి అత్యధిక ప్రాంతాలు, వేలాదిమంది ప్రయాణికులకు రైలు ప్ర యాణ సౌకర్యాన్ని కల్పించాల్సిన అవసరముంది. కాజీపేట జంక్షన్‌ నుంచి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బ ల్లార్షా, చంద్రపూర్‌, మజ్రికదాన్‌, ఆదిలాబాద్‌ మీ దుగా నాందేడ్‌, పర్భానీ, జల్న, శంభాజీనగర్‌, నాగర్‌సోల్‌, మన్మాడ్‌, నాసిక్‌ రోడ్‌, కళ్యాణ్‌, థాణే, దా దర్‌ (ముంబై)కి రైలు నడపడంతో కరీంనగర్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరి ధిలోని ప్రయాణికులకు సౌలభ్యం కలిగే అవకాశాలు న్నా అమలు చేయడం లేదు. ఏ కారణంగానో రై ల్వేశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

తగ్గనున్న దూరభారం

కాజీపేట నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లడానికి ఈ మార్గం అత్యంత దగ్గరవుతుంది. ప్రతిపాదిత రూట్‌ను అమలు చేస్తే దూరభారం తగ్గుతుంది. ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ మార్గం ఆదిలాబాద్‌ నుంచి కాజీపేట వయా నిజామాబాద్‌, చర్లపల్లితో పోలిస్తే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మార్గం ద్వారా కాజీపేట నుంచి ఆదిలాబాద్‌కు దాదాపు 162 కిలోమీటర్ల దూరం తగ్గడానికి అవకాశాలున్నాయి. ఇన్ని రకాల ప్రయోజనాలున్న దాదర్‌ వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును పునరుద్ధరించి, క్రమబద్ధీకరించాలని ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నా రైల్వేశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికై నా రైల్వే అధికారులతోపాటు కరీంనగర్‌, పెద్దపల్లి, ఆదిలా బాద్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని క్రమబద్ధీకరించేందుకు చొరవ చూపాల్సిన అవసరాన్ని రైలు ప్రయాణికులు గుర్తు చేస్తున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాతో అనుసంధానం

దాదర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరిస్తే పాత అనుబంధం మళ్లీ చిగురిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆదిలాబాద్‌తో విడిపోయిన అనుబంధం పెనవేసుకుంటుంది. మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ (టీ), కాగజ్‌నగర్‌ తదితర ప్రాంతాల రైల్వే ప్రయాణికులకు ఆదిలాబాద్‌ రైల్వే స్టేషన్‌తో నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement