నేడు నీట్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు నీట్‌

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

● జిల్లా కేంద్రంలో నాలుగు పరీక్షా కేంద్రాలు ● హాజరుకానున్న విద్యార్థులు 1,144 మంది

మంచిర్యాలఅర్బన్‌: వైద్య విద్యలో ప్రవేశంకోసం ఆదివారం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష (నీట్‌–2026) కోసం సర్వం సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణకు జిల్లా కేంద్రంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్దేశిత సమయం దాటితే లోనికి అనుమతించరు. మంచిర్యాలలో తెలంగాణ ఆదర్శ పాఠశాల (రాజీవ్‌నగర్‌)లో 384 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కాలేజీరోడ్‌)లో 232 మంది, జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల (బస్టాండ్‌ పక్కన) 288 మంది, జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల (మార్కెట్‌ ఏరియా) పరీక్షా కేంద్రంలో 240 మొత్తంగా 1,144 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో 24 మందికి ఇద్దరు ఇన్విజలేటర్లు పర్యవేక్షించనున్నారు. సీసీ కెమెరాలు, జామారాలను అమర్చారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాల మూసివేత, 163 సెక్షన్‌ ఆంక్షలతో పాటు పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు.

పరీక్ష కేంద్రాలు పరిశీలించిన అడిషనల్‌ కలెక్టర్‌

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను శనివారం అడిషనల్‌ కలెక్టర్‌ రాములు, సిటీ కోఆర్డి నేటర్‌ జైకిషన్‌ ఓజా సందర్శించారు. తరగతి గదులు, నిఘా కెమెరాల ఏర్పాటు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఇన్విజిలేటర్లకు ఓరియంటేషన్‌

నీట్‌కు సంబంధించిన ఇన్విజిలేటర్లకు స్థానిక రాజీవ్‌నగర్‌ తెలంగాణ మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో శనివారం ఓరియంటేషన్‌ నిర్వహించారు. సెంటర్‌ సూపరింటెండెంట్‌ ముత్యం బుచ్చన్న పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాములు పరీక్ష నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా అడ్మిట్‌కార్డు, మూడు ఫొటోలు (ఒకటి పోస్టుకార్డ్‌ సైజు, రెండు పాస్‌ఫొటోలు), ఒరిజినల్‌ ఐడీ ప్రూప్‌ వెంట తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు, డిప్యూటీ సెంటర్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, అబ్జర్వర్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

విద్యార్థులు మర్చిపోవద్దు..

విద్యార్థులు తప్పనిసరిగా అడ్మిట్‌ కార్డు, రెండు పాస్‌ఫొటోలు, పోస్టుకార్డు సైజ్‌ ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపుకార్డు (ఆధార్‌, డ్రైవింగ్‌ లైస్సెన్స్‌, తదితర)లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్‌ పరికరాలు వ్యాలెట్‌, చేతి గడియారాలు, కెమెరాలు, కాలిక్యులేటర్లు, పెన్నులు లోనికి అనుమతించరు. ఆభరణాలు, భారీ దుస్తులు, బూట్లు ధరించవద్దు. బయోమెట్రిక్‌ హాజరు నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిది.

Advertisement
 
Advertisement
Advertisement