నస్పూర్: విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరం ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శనివారం సీసీసీ నస్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఎంఎం గార్డెన్‌లో నిర్వహించిన గంజాయి వినియోగం–దుష్పరిణామాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తుకు బానిసైన వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, నార్కోటిక్స్ పెద్దపల్లి విభాగం సీఐ రాజ్‌కుమార్, సీసీసీ నస్పూర్ ఎస్సై మేకల ప్రశాంత్, హాజీపూర్ ఎస్సై కిరణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


