బెల్లంపల్లి: బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్‌కు రోజు వారీగా కనీసం టన్ను మామిడికాయలు కూడా అ మ్మకానికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెటింగ్ అధికారుల నిర్లక్ష్యం, దిగుబడి గణనీయంగా పడిపోవడం, కొద్దిపాటిగా చేతికందిన కాయలకు మంగు, మచ్చలు ఏర్పడడం, మద్దతు ధర లేకపోవ డం వంటి ప్రతికూల అంశాలు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బెల్లంపల్లి మార్కెట్‌లో మామిడి కొనుగోళ్లు ప్రారంభించి వారం రోజులు కావస్తున్నా వ్యాపారులు, రైతుల నుంచి కనీస స్పందన లేదు. ఓ చిరువ్యాపారి ద్వారా మొక్కుబడిగా కొనుగోళ్లు చేపట్టి ఆనవాయితీని కొనసాగిస్తున్నార నే విమర్శలు వస్తున్నాయి. తొలిసారిగా గత ఏడాది బెల్లంపల్లిలో ప్రారంభించిన మామిడికాయల కొనుగోళ్లు ఆశాజనకంగా సాగాయి. పక్షం రోజులపాటు క్రయవిక్రయాలు సాగి సుమారు ఆరు వేల క్వింటాళ్ల వరకు అమ్మకానికి వచ్చాయి. ఒకరిద్దరు బడా వ్యాపారులు రావడంతో రైతులు మ్యాంగో మార్కెట్‌కు తీసుకొచ్చి కాయలు విక్రయించారు. రైతులకు పెద్దగా లాభాలు రాకపోయినా నాగ్‌పూర్‌కు తీసుకెళ్లే వెతలు తప్పి రవాణా ఖర్చులు మిగిలాయి. ఈసారి ఆమాత్రం వెసులుబాటు కూడా లేకపోవడం రైతులను నిరాశకు గురి చేస్తోంది.
తగ్గిన దిగుబడి
మామిడి కాతపై ఈసారి ప్రకృతి తీవ్ర ప్రభావం చూపింది. పూత విరబూసినా అకాల వర్షాలు, చీడపీడల వల్ల పూత అధిక శాతం నేలపాలైంది. అక్కడక్కడ నిలిచిన పూత పిందె దశకు చేరుకునే క్రమంలో అకాల వర్షాలకు రాలిపోయింది. ప్రతికూల పరిస్థితులతో దిగుబడి పడిపోయింది. ఉద్యానవన అధికారుల లెక్కల ప్రకారం సాధారణంగా ఒక ఎకరాకు ఐదు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం టన్ను కూడా రాకుండాపోయింది. దీనికి తోడు కాయలపై మంగు, మచ్చలు ఏర్పడడంతో మద్దతు ధర కరువైంది.
నాగ్‌పూర్ మార్కెట్‌లో ధర ఇలా..
బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్‌కు డిమాండ్ ఉన్నా మామిడి కాయలు రావడం లేదు. కొద్దిపాటి నీలం, తోతపరి తదితర రకాల కాయలు మాత్రమే వస్తున్నాయి. దశేరి, బంగెనపల్లి, హిమాయతి వంటి ము ఖ్యమైన రకాలు కానరావడం లేదు. వీటికి మార్కెట్‌లో కనీస మద్దతు ధర ఉంటుంది. బడా వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో నాగ్‌పూర్ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మాలనే తలంపులో రైతులు ఉన్నారు. ప్రస్తుతం నాగ్‌పూర్ మ్యాంగో మార్కెట్‌లో దశేరి రకం కాయలకు టన్నుకు రూ.25 వేలు ధర చెల్లిస్తుండగా, బంగెనపల్లి రకానికి రూ.20 వేలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ఆదిలో దశేరి కాయలు టన్నుకు రూ.60 వేలు ధర పలుకగా, బంగెనపల్లి కాయల ధర రూ.50 వేలు చెల్లించి బడా వ్యాపారులు రైతుల్లో ఆశలు కల్పించారు. ఆయా రకాల కాయల ధరలు ప్రస్తుతం సగానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులను చవి చూస్తున్నారు. బెల్లంపల్లి మార్కెట్‌కు బడా వ్యాపారులను రప్పించి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవడంలో మార్కెటింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.
మద్దతు ధర లేదు
చెట్లకు వచ్చిన పూత చూసి కాపు లీజుకు తీసుకున్న. తీరా పూతంతా రాలిపోయింది. తోటలన్నీ కాపులేక వెలవెలబోతున్నాయి. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి లీజుకు తీసుకున్న తోటల్లో దిగుబడి పడిపోయింది. కొద్దిపాటిగా చేతికందిన కాయలకు మద్దతు ధర దక్కుతుందనే ఆశతో ఉండగా నాగ్‌పూర్ బడా వ్యాపారులు దశేరి, బంగెనపల్లి రకాల ధరలు బాగా తగ్గించి కొంటున్నారు. బెల్లంపల్లిలోనూ మద్దతు ధర లేకుండాపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – బాబా, గుత్తేదారు, బెల్లంపల్లి
కాపు పడిపోయింది
గత మూడు నాలుగేళ్ల నుంచి మామిడి కాపు పడిపోతున్నది. చెట్టు నిండా పూత విరబూసిన ఫాయిదా ఉంటలేదు. వచ్చిన పూత వచ్చినట్లే రాలిపోయి కొద్దిపాటి పూత మాత్రమే నిలుస్తున్నది. ఈసారి కూడా అట్లనే జరిగింది. అక్కడక్కడ పిందెలు నిలిచి కాయ దశకు చేరుకోగానే అకాల వర్షాలతో పంట నేలపాలైంది. అమ్మకానికి తీసుకెళ్లడానికి కాయలు కానరాకుండా ఉన్నాయి. కాపు పడిపోయి కష్టాలు మిగిలాయి. – గోమాస మల్లయ్య, మామిడి రైతు, మాలగురిజాల


