మే 10వరకు అవకాశం 33 ప్రశ్నలకు వివరాలు తప్పనిసరి స్వతహాగా వివరాల నమోదుకు అవకాశం అవగాహన కల్పిస్తున్న అధికారులు జిల్లాలో నమోదు చేసుకున్న వారు రెండు వేల మందికి పైనే..
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియలో సెల్ఫ్ ఎన్యుమరేషన్(స్వీయ గణ న) ప్రక్రియ మొదలైంది. మే 10వరకు ఎవరికి వా రు స్వీయ గణన చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం పోర్టల్‌లో కుటుంబంలోని ఒకరి సెల్ నంబరుతో లాగిన్ అయి, వారి కుటుంబ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లా అధికారులు పలువురు స్వీయ గణన ద్వారా వివరాలను నమోదు చేసుకోగా, ప్రజలు సైతం ముందుకు వచ్చేందుకు అవగాహన కల్పిస్తున్నారు. మే 11నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి జనగణన చేపడుతారు. అందుకు ముందుగానే స్వీయ గణన చేసుకోవడం వల్ల ఎన్యుమరేటర్లు వచ్చిన సమయంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న సమయంలో వచ్చిన 11 అంకెల రెఫ రెన్స్ ఐడీని ఇస్తే సరిపోతుంది. ఒకవేళ వివరాలు తప్పుగా ఉన్నా, ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కూడా ఉండగా, ఇంటి పెద్ద వివరాలను మాత్రం మార్చేందుకు అవకాశం ఉండదు. ఎన్యుమరేటర్లు వచ్చిన సమయంలో ఇంట్లో లేకున్నా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఆన్‌లైన్ ద్వారా స్వీయ గణన చేసుకున్న రెఫరెన్స్ ఐడీని ఎన్యుమరేటర్‌కు చెబితే సరిపోతుంది.
ఎక్కడున్నా నమోదుకు అవకాశం
జనగణన వివరాలను ఎక్కడ ఉన్నా నమోదు చేసుకునేందుకుhttp://se.census.gov. inవెబ్‌సైట్‌లో లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించింది. జనగణన తొలిదశ మే 11నుంచి ప్రారంభం కానుంది. అందులో భాగంగా హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ జరగనుండగా, వీటిని ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి చేపట్టనున్నారు. ఏ ఒక్క కుటుంబం వివరాలను కూడా తప్పిపోవద్దనే ఉద్దేశ్యంతో స్వీయ గణనకు అవకాశం కల్పించారు. మే 10వరకు ప్రజలే ఎన్యుమరేటర్లుగా మారి వారి వివరాలను నమోదు చేసుకోవచ్చు. కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ నమోదు చేసిన తరువాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన వెంటనే 33 రకాల ప్రశ్నలకు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత సబ్‌మిట్ చేయడంతో హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల సంఖ్యతో ఐడీ వస్తుంది. దీనిని భద్రపరుచుకుని, జనగణనకు ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు చెబితే సరిపోతుంది.


