మద్యం మత్తులో మహిళ హత్య | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో మహిళ హత్య

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

లైంగికదాడికి యత్నించిన కామాంధుడు ఆమె ప్రతిఘటించడంతో ఘాతుకం 48 గంటల్లో ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: మద్యం మత్తులో మహిళపై లైంగికదాడికి యత్నించిన నిందితుడు ఆమె ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి ఆదిలాబాద్‌ పట్టణంలోని పంజాబ్‌చౌక్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌లో ఎస్పీ అఖిల్‌మహాజన్‌ విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 24న పంజాబ్‌చౌక్‌ సమీపంలోని డ్రెయినేజీలో జనగమ్వార్‌ అనిత మృతదేహం లభ్యమైంది. మృతురాలి సోదరుడు సంతోష్‌ ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశాడు. శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో మహారాష్ట్రకు చెందిన నర్సింగా సంతోబా గంపల్వాడ్‌ను నిందితుడిగా గుర్తించాం. మృతురాలు ఘటనా స్థలంలో విశ్రాంతి తీసుకునే సమయంలో మద్యం మత్తులో ఉన్న నిందితుడు చెత్త ఏరుకునే ఆమెను ఎవరూ లేని ప్రదేశమైన కాలువ వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురై గొంతు నులిమి హత్య చేశాడు. ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహన్ని డ్రెయినేజీలో పడేశాడు. కాగా, కేసును 48 గంటల్లో చేధించినట్లు ఎస్పీ తెలిపారు. నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసును ఛేదించిన వన్‌టౌన్‌ సీఐ సునిల్‌ కుమార్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్సైలు సంజయ్‌, అశోక్‌ను ప్రత్యేకంగా అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలతో పాటు నగదు రివార్డులు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement