ప్రాణం పోసిన ‘108’ | - | Sakshi
Sakshi News home page

ప్రాణం పోసిన ‘108’

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

● రెండు ఆసుపత్రుల్లో కరువైన వైద్యులు ● రిమ్స్‌కు తరలిస్తుండగా అంబులెన్స్‌లో ప్రసవం.. ● 108 సిబ్బంది చొరవతో తల్లీబిడ్డ క్షేమం

నార్నూర్‌: పురిటి నొప్పుల వేళ ఓ నిండు గర్భిణికి సకాలంలో వైద్యసేవలు అందక 108లో ప్రసవించాల్సిన దుస్థితికి నిదర్శనం ఈ ఘటన. వైద్యసిబ్బంది అందుబాటులో లేని ఆసుపత్రుల కంటే ఆపత్కాలంలో అండగా నిలిచిన వారి మానవత్వమే తల్లీ బిడ్డను కాపాడాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చిత్తగూడ గ్రామానికి చెందిన రంభబాయికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే గాదిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఝరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడా సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరకు 108లో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో లోకారి సమీపంలో ఆమె ప్రసవించింది. అంబులెన్స్‌ సిబ్బంది చొరవతో ఆమె ఆడ శిశువుకు జన్మినిచ్చింది. అనంతరం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా, ఈ ఘటనలో ఆ తల్లి పురిటి వేదన హృదయ విదారకంగా నిలిచింది. సకాలంలో వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో ఆమె ప్రాణాలకు ముప్పు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. రెండు చోట్ల వైద్య సిబ్బంది లేకపోవడం సర్కారు దవాఖానాల దుస్థితికి అద్దం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement