మంచిర్యాలరూరల్(హాజీపూర్): మున్నూరు కాపులను తక్కువ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి గాదె సత్యం అన్నారు. సోమవారం మంచిర్యాలలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపులను ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 13.75 లక్షల వరకు ఉన్నట్లు లెక్కలు చూపించడం అన్యాయమని అన్నారు. అన్ని బీసీ కులాల సంఖ్యను చాలా తక్కువ లెక్కల్లో చూపించారని ఆరోపించారు. మున్నూరు కాపుల గణాంకాల వాస్తవాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌చార్జి నియామకమైన గాదె సత్యంను జిల్లా మున్నూరు కాపు కులబాంధవులు ఘనంగా సన్మానించారు.
రేసు కుక్కల దాడిలో
15 గొర్రెలు మృతి
కోటపల్లి: రేసుకుక్కల దాడిలో 15గొర్రెలు మృతిచెందాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి నక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధి బ్రహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన కొండ మల్లయ్య తన గొర్రెలను అటవీ ప్రాంతంలో మేతకు తీసుకెళ్లగా రేసుకుక్కలు ఒక్కసారిగా గుంపుతో వచ్చి దాడి చేశాయి. గొర్రెలు అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా వెళ్లిపోయాయి. కొన్ని గొర్రెలు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోగా, మిగిలిన వాటిని కాపరి గ్రామంలోకి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం దాడి చేసిన స్థలానికి కాపరులతో వెళ్లి పరిశీలించగా 15 గొర్రెలు మృతిచెంది కనిపించాయి. అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరాడు.


