వడదెబ్బతో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఒకరి మృతి

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

● వంట చెరుకు కోసం అడవికి.. ● మరో 15రోజుల్లో కూతురు పెళ్లి ● మైలారంలో విషాదం

నెన్నెల: పెళ్లి డప్పు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. మరో పక్షం రోజుల్లో కూతురు పెళ్లి చేయాల్సిన తండ్రి మరణం విషాదం మిగిల్చింది. మండలంలోని మైలారం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోగారపు మారయ్య(56) చిన్న కూతురు వివాహం వచ్చే నెల 13న జరగాల్సి ఉంది. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ నెల 24న మధ్యాహ్నం వంట చెరుకు కోసం ఎడ్లబండిలో అడవికి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి జాడ కోసం అదే రోజు రాత్రి అడవంతా వెతికినా దొరకలేదు. రెండో రోజు ఉదయం మళ్లీ అడవిలోకి వెళ్లి గాలించగా ఓ చోట ఎడ్లు, బండి కనిపించాయి. మారయ్య ఆచూకీ లభించలేదు. మూడో రోజు ఆదివారం సాయంత్రం మైలారం గ్రామ శివారులో ఓ వాగు ఒడ్డున విగత జీవిగా కనిపించాడు. మారయ్య అడవిలో దారి తప్పి నీటి కోసం వెతుకుతూ వాగు వద్దకు వెళ్లి వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి పెద్ద అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడి కుమారుడు వెంకటేషం ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement