● కొనుగోలు కేంద్రాలు ప్రారంభాలతోనే సరి ● తూకం వేయని ధాన్యం.. రైతుల ఎదురు చూపులు ● ఉదయం ఎండలు, సాయంత్రం మబ్బులు.. చిరుజల్లులు | - | Sakshi
Sakshi News home page

● కొనుగోలు కేంద్రాలు ప్రారంభాలతోనే సరి ● తూకం వేయని ధాన్యం.. రైతుల ఎదురు చూపులు ● ఉదయం ఎండలు, సాయంత్రం మబ్బులు.. చిరుజల్లులు

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

● కొనుగోలు కేంద్రాలు ప్రారంభాలతోనే సరి ● తూకం వేయని ధాన్యం.. రైతుల ఎదురు చూపులు ● ఉదయం ఎండలు, సాయంత్రం మబ్బులు.. చిరుజల్లులు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: అట్టహాసంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. వారం రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కుప్పల వద్ద తిప్పలు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా ఉదయం ఎండ, సాయంత్రం మబ్బులు, అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎండలో ఆరబోస్తూ.. సాయంత్రం కుప్పలు చేసి కవర్లు కప్పుతున్నారు. భారీ వర్షం కురిస్తే ధాన్యం నేలపాలవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి ధాన్యం దిగుబడి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోశారు. ఈ నెల 13న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం తూకం, మిల్లులకు తరలింపు లేక నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే ప్రారంభించిన కేంద్రాల్లో మిల్లులకు ట్యాగింగ్‌ లేక, తూకం వేయక, లారీలు రాక ధాన్యం కదలడం లేదు. వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. పూర్తి స్థాయిలో కేంద్రాలు, మిల్లులకు ట్యాగింగ్‌ చేయలేదు. ఏ కేంద్రం ఏ మిల్లుకు కేటాయిస్తారోనని గందరగోళం నెలకొంది.

58 కొనుగోలు

కేంద్రాలు ప్రారంభం

జిల్లాలో వివిధ ఏజెన్సీల ద్వారా 313 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటివరకు 58 కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం తరలింపు లేదు. తూకం వేసిన ధాన్యం ట్రక్‌షీట్‌ ఎంట్రీ, మి ల్లులకు తరలించి అన్‌లోడ్‌, రిసీవింగ్‌ ఎంట్రీ తదిత ర వివరాలు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కానీ కేంద్రాల కేటాయింపు, మిల్లులకు ట్యాగింగ్‌లో స్పష్టత రాలేదు. ధాన్యం తరలించకపోవడంతో నిర్వాహకులు రైతుల ధాన్యాన్ని తూకం వేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తూకం వేసిన ధాన్యం రోజుల తరబడి కేంద్రంలో నిల్వ చేస్తే మిల్లుకు తరలించిన సమయంలో బరువు తగ్గి నష్టపోవాల్సి వస్తుందని, తరుగు పేరుతో మిల్లర్లు కోత విధించే అవకాశం ఉందని నిర్వాహకులు వాపోతున్నారు.

లక్ష్యం భారీగా.. సేకరణ ఆలస్యం..

జిల్లాలో ఈ యాసంగి 1.22 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 2.20లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేసి 313 కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు. దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్‌ మండలాల్లో 58 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా క్వింటా ధాన్యం కూడా మిల్లుకు తరలించినట్లు ట్యాబ్‌ ఎంట్రీ లెక్కలో రాలేదు. జిల్లాలో ధాన్యం సేకరణపై అదనపు కలెక్టర్‌, పౌరసరఫరాల శాఖ అధికారులను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement