జిల్లాలోని ఏడు చెరువులకు అమృత్ 2.0 పథకం నిధులు
పనులు ప్రారంభించి వదిలేసిన పాలకులు
వేసవిలో పూర్తి చేస్తే ప్రయోజనం
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లోని చెరువులను పునరుద్ధరించడంతో పాటు, బ్యూటిఫికేషన్ చేపట్టేందుకు నిధులు విడుదల చేసింది. ప్రజారోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో నెలన్నర క్రితమే ఆయా చెరువుల్లో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. చెరువుల పునరుద్ధరణకు వేసవి కాలంలో పనులు చేపడితేనే వర్షాకాలంలోపు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. పనులకు శంకుస్థాపన చేసినా, జిల్లాలోని ఒక్క చెరువు పనులను కూడా ప్రారంభించక పోవడంతో చెరువుల బ్యూటిఫికేషన్ వర్షాకాలంలోపు పూర్తి చేయడం కష్టంగానే ఉంది.
పునరుద్ధరణతో ప్రయోజనం
పురపాలికల్లో డ్రెయినేజీల నుంచి మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్తుండడంతో మురుగు నీటితో నిండిపోయి, గుర్రపు డెక్క, నాచు పెరగడంతో పాటు, చెత్తా చెదారంతో నిండి కంపు కొడుతున్నాయి. చెరువుకు హద్దులుగా కట్టలను ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణకు గురవుతున్నాయి. చెరువుల వద్ద కాస్త సేదతీరేందుకు అవకాశం లేకుండా పోయింది. పట్టణ ప్రాంతాల్లోని చెరువులను ప్రజలకు ఆహ్లాదం పంచేలా, వాటిని పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని ఒక్కో చెరువుకు పనులను బట్టి నిధులను విడుదల చేసింది. అందులో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాముని చెరువుకు రూ.1.98 కోట్లు, నస్పూర్ చెరువుకు రూ.3.14 కోట్లు, బెల్లంపల్లి మున్సిపాలిటీలోని జాజికుంట చెరువుకు రూ.1.57 కోట్లు, మందమర్రి మున్సిపాలిటీలోని మందమర్రి చెరువుకు రూ.3.14 కోట్లు, చెన్నూరు మున్సిపాలిటీలోని కుమ్మరి చెరువుకు రూ.1.87 కోట్లు, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలోని కుమ్మరికుంటకు రూ.1.98 కోట్లు, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీలోని ఇటిక్యాల చెరువుకు రూ.3.14 కోట్ల నిధులు కేటాయించారు. వీటితో చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా తక్షణ చర్యలు చేపడతారు. చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, చెరువు కట్ట నిర్మాణం చేసి, ఫోర్ షోర్ బండ్ పనులు చేపడతారు. చెరువుల్లోకి వర్షపు నీరు మాత్రమే చేరేలా చర్యలు చేపట్టి, పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తారు.
జిల్లాలో ఎంపిక చేసిన చెరువులు,
అమృత్ 2.0 పథకం కింద మంజూరైన నిధులు
మున్సిపాలిటీ/కార్పొరేషన్ ఎంపిక చేసిన చెరువులు నిధులు
మంచిర్యాల కార్పొరేషన్ రాముని చెరువు రూ.1.98 కోట్లు
నస్పూర్ నస్పూర్ చెరువు రూ.3.14 కోట్లు
బెల్లంపల్లి జాజికుంట చెరువు రూ.1.57 కోట్లు
మందమర్రి మందమర్రి చెరువు రూ.3.14 కోట్లు
చెన్నూర్ కుమ్మరి చెరువు రూ.1.87 కోట్లు
క్యాతన్‌పల్లి కుమ్మరికుంట రూ.1.98 కోట్లు
లక్సెట్టిపేట్ ఇటిక్యాల చెరువు రూ.3.14 కోట్లు


