భూసార పరీక్షలకు వేళాయె..! | - | Sakshi
Sakshi News home page

భూసార పరీక్షలకు వేళాయె..!

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

● రెవెన్యూ గ్రామానికి ముగ్గురి చొప్పున వలంటీర్ల ఎంపిక ● శిక్షణ అనంతరం క్షేత్రస్థాయిలో మట్టి నమూనాలు సేకరణ

చెన్నూర్‌రూరల్‌: భూసారానికి అనుగుణంగా పంటలను సాగు చేయించి, నాణ్యమైన అధిక దిగుబడులను సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురి చొప్పున వలంటీర్లను నియమిస్తోంది. చెన్నూర్‌ డివిజన్‌లోని చెన్నూర్‌, కోటపల్లి, భీమారం, జైపూర్‌, మందమర్రి మండలాలకు సుమారుగా 310 మందిని ఎంపిక చేశారు. వీరికి త్వరలో వ్యవసాయ శాస్త్రవేత్తలచే శిక్షణ ఇచ్చి పంట పొలాల్లోని మట్టిని సేకరించి ఆదిలాబాద్‌లోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

భూసార పరీక్షలతో మేలు..

భూసార పరీక్షల వల్ల భూముల్లోని పోషకాల మోతాదు తెలుస్తుంది. పోషకాలు తక్కువగా ఉంటే వ్యవసాయాధికారులు వాటిని పెంచడానికి చర్యలు తీసుకుంటారు. నత్రజని, భాస్వరం, పొటాషియం, ఐరన్‌, జింక్‌, బోరాన్‌, మెగ్నీషియం తదితరాల శాతాన్ని గుర్తిస్తారు. వీటికి అనుగుణంగా ఎలాంటి పంటలు సాగు చేయాలో వ్యవసాయాధికారులు సూచిస్తారు. ఎరువులను ఎంత మోతాదులో వాడాలో సిఫారసు చేస్తారు. ఫలితంగా ఎరువుల వినియోగం, పెట్టుబడుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. సేద్యపు రంగంలో ఆధునిక శాసీ్త్రయ పద్ధతులను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు భూసార పరీక్షల కోసం మట్టినమూనాలను సేకరించేందుకు వలంటీర్లు, ఏఈవోలు వ్యవసాయ క్షేత్రాలను ఏవిధంగా ఎంపిక చేసుకోవాలి? ఏవిధంగా సేకరించాలి? అనే అంశాలు, అలాగే పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శిక్షణ ఇస్తారు. సేకరించిన మట్టి నమూనాలను ఆదిలాబాద్‌లోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫలితాలను రైతులకు తెలియజేయనున్నారు. పరీక్షల ఫలితాల అనంతరం భూసారం ఎంత ఉంది? ఎలాంటి పంటలు సాగు చేయాలి? ఎరువులు ఎంత మోతాదులో వాడాలి. అనేది వ్యవసాయశాఖ అధికారులు రైతులకు తెలియజేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement