మంచిర్యాలఅర్బన్: వేసవి సెలవులు ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను మరింత పెంచుకునేలా జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో సైన్స్ సమ్మర్ క్యాంపు నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు ప్రయోగత్మాక సైన్స్ విద్య అమలు చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆలోచనలను మార్చడంతోపాటు ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం జిజ్ఞాస సంచార వాహనం ద్వారా 128 పాఠశాలలకు చెందిన 750 ప్రదర్శనలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా సైన్స్ ప్రయోగాలపై అవగాహన కల్పించడానికి ఈ నెల 27 నుంచి మే 8 వరకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు.
80 మందికి అవకాశం..
వేసవి సెలవుల్లో విద్యార్థులు కాలక్షేపానికి పరిమితం కాకుండా సైన్స్‌పై ఆసక్తి పెంపొందించుకునేలా విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా నూతన ఆవిష్కరణలపై విద్యార్థులకు వివిధ అంశాలపై తర్పీదు ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు చెందిన 80 మంది విద్యార్థులు శిబిరాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ కొనసాగనుంది. సైన్స్ సెంటర్‌లో భౌతిక రసాయన, బయోసైన్స్‌పై వివిధ అంశాల్లో ప్రయోగాత్మకంగా సులభతరంగా శిభిరాల నిర్వహణకు రూపకల్పన చేశారు. శిబిరంలో పాఠ్యపుస్తకాన్ని ప్రయోగాత్మకంగా, భయం నుంచి విశ్వాసానికి మార్చుటకు, సబ్జెక్టు నిపుణుల సెషన్‌లతో పాటు, ప్రేరణాత్మక సెషన్‌లు, ఎలక్ట్రానిక్, రోబిటిక్ సెషన్‌లపై నేర్పించనున్నారని డీఈవో యాదయ్య ప్రకటించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్‌ను సంప్రదించాలన్నారు.
సైన్స్ సమ్మర్‌క్యాంపులో..
వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంచడం, ప్రయోగాల ద్వారా నేర్పించడం, క్రియేటివిటీ, ఆలోచనాశక్తి పెంచడం, సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్, ప్రాజెక్టులు తయారు చేయడం, తదితర అంశాలపై శిభిరంలో నేర్పించనున్నారు.


