లక్ష్మణచాంద: వ్యవసాయ జిల్లాగా పేరున్న నిర్మల్ జిల్లాలో అన్నదాతలు పత్తి, వరి, సోయా పంటలను ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ సాగు చేసే పంట పత్తి. పత్తి విత్తనాలు అధిక ధరలు ఉండటంతో రైతులకు సాగు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈనేపథ్యంలో పత్తి సాగు చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రతీ సంవత్సరం పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఊరటనిస్తూ పత్తి విత్తనాల ధరలను ప్రస్తుతానికి పెంచకూడదని నిర్ణయం తీసుకుంది.
పాత ధరలే కొనసాగింపు..
అధిక సాగు ఖర్చులతో సతమతమవుతున్న రైతులకు 2026 –27 సంవత్సరానికి పాత ధరలనే కొనసాగిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి రైతులు ఎక్కువ మొగ్గు చూపే బీజీ –2 (475 గ్రాములు) ప్యాకెట్ ధర రూ.901, బీజీ –1 (475 గ్రాములు) ప్యాకెట్ ధర రూ.635 పాత ధర ఉంది. ఈ ధరలే 2026 –27లో కొనసాగించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది.
ఉమ్మడి జిల్లా వివరాలు..
నిర్మల్ జిల్లాలో ఈ వానాకాలం 1.40లక్షలు –1.50 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుందని జిల్లా వ్యవసాయాధికారులు అంటున్నారు. ఎకరానికి రెండు ప్యాకెట్ల చొప్పున 1.50 లక్షల ఎకరా లకు 3 లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరం అవుతాయి. మంచిర్యాలలో 1.60 లక్షల ఎకరాలు, ఆసిఫాబాద్‌లో 3.5 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్‌లో 4.26 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశం ఉంది. మొత్తంగా 25లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయి.
జిల్లా సాగు విస్తీర్ణం విత్తనాలు
(లక్షల ఎకరాలు) (లక్షల ప్యాకెట్లు)
ఆదిలాబాద్ 4.26 11.50
మంచిర్యాల 1.60 3.10
ఆసిఫాబాద్ 3.5 7.5– 8
నిర్మల్ 1.40– 1.50 3
జిల్లాల వారీగా పత్తి సాగు విస్తీర్ణం, అవసరమైన విత్తనాలు..


