నెన్నెల: కాయలు పక్వానికి వచ్చాక తింటే వాటి రుచే వేరు. కానీ కొందరు పచ్చికాయలుగా ఉన్నప్పుడే వాటిలో కార్బైడ్, ఇతర మందులు వినియోగించి మగ్గిన తర్వాత విక్రయిస్తున్నారు. విచ్ఛలవిడిగా కార్బైడ్ వాడుతూ వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి పండ్లు తింటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పండ్ల మార్కెట్‌లపై అధికారులు దాడులు నిర్వహించి వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. మామిడి పండ్లను విషతుల్యమైన రసాయనాలతో పండిస్తున్నారు.
ఆరోగ్యంపై దుష్ప్రభావం..
కార్బైడ్‌తో మగ్గపెట్టిన మామిడి పండ్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ రసాయనం సాధారణంగా గ్యాస్ వెల్డింగ్‌లో వినియోగించేందుకు ఉపయోగిస్తారు. ఈ కార్బైడ్‌తో మగ్గపెట్టిన పండ్లను తీసుకునే వారికి జీర్ణకోశవ్యాధులు, ఎలర్జీ, కడుపునొప్పి, మూత్రపిండ వ్యాధులు వస్తుంటాయి. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు గర్భిణులు, పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయని వైద్యులు పేర్కొంటున్నారు.
నిషేధం అమలులో ఉందా..?
మామిడికాయలను కార్బైడ్‌తో మగ్గపెట్టడం నేరమని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని నిషేధించాయి. 1995 చట్టం కింద ఎవరైనా మామిడి పండ్లను రసాయనాలతో మగ్గపెడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సీజనల్ వ్యాపారాల్లో మామిడి పండ్ల విక్రయాలు సాధారణమవడంతో మగ్గపెట్టిన మామిడి విక్రయాలు ఏటా జోరందుకుంటున్నాయి.
సహజంగా పండిన పండ్లు రుచికరం..
సహజంగా మగ్గిన పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజంగా చెట్టుపై పక్వానికి వచ్చిన కాయలను చూసి వాటిని వరిగడ్డితో, తునికాకులతో కప్పి ఉంచితే నాలుగు రోజులు నుంచి వారం రోజుల్లో బాగా మగ్గి పండుగా మారుతాయి. ఇలాంటివి రంగు, రుచితో మదురంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం గంటల వ్యవధిలోనే మామిడికాయలను రసాయనాలతో మగ్గపెట్టి వ్యాపారాలు సాగిస్తూ ఆరోగ్యాలపై ప్రభావం చూపించే విధానంతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు కార్బైడ్‌తో పండించే మామిడి పండ్లను నిషేధించాలని, మార్కెట్‌లో దాడులు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.


