వెలుగులోకి డివైన్‌ గ్రూప్‌ మోసాలు | - | Sakshi
Sakshi News home page

వెలుగులోకి డివైన్‌ గ్రూప్‌ మోసాలు

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

● ఏజెంట్లను నియమించుకొని అధిక లాభం పేరిట వల ● రూ.2 కోట్లకు పైగా దండుకున్న వైనం

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌లో కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన డివైన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రధాన నిందితురాలు ఠాకూర్‌ శివరంజినిబాయి అరెస్టుతో కేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్‌కు చెందిన ఒక కుటుంబం అధిక లాభం పేరిట వల విసిరి రూ.2 కోట్లకు పైగా దండుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

కాగజ్‌నగర్‌లో మకాం..

ఠాకూర్‌ కరణ్‌ సింగ్‌ 2021 ఆగస్టులో కాగజ్‌నగర్‌లో మకాం వేశాడు. పట్టణంలో రిటైర్డ్‌ ఉద్యోగులు, కా ర్మికులు, సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండటంతో వారిని టార్గెట్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొదట స్థానికంగా కొంత మంది ఏజెంట్లను నియమించుకున్నారు. నెలకు 5 శాతం నుంచి 20 శాతం లాభం, డబ్బు డబుల్‌ అని ప్రచారం చేయించారు.

మొదట నమ్మించి.. తర్వాత బురిడీ

మొదట్లో కొంత మందికి చెప్పినట్లుగానే లాభాలు ఇచ్చి నమ్మకం కలిగించారు. రూ.లక్ష కడితే నెలకు రూ.10వేలు చేతిలో పెట్టారు. దీంతో నోటిమాట ద్వారా ప్రచారం జరిగి వందల మంది పెట్టుబడులు పెట్టారు. భారీగా డబ్బులు చేతికొచ్చాక 2023 జనవరిలో ఒక్కసారిగా కార్యాలయానికి తాళం వేసి కుటుంబంతో సహా పారిపోయారు. ఈ ముఠా కాగజ్‌నగర్‌లోనే కాకుండా హైదరాబాద్‌, పెంచికల్‌పే ట్‌, లాలాగూడ పరిధిలోనూ ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ ఇప్పటి వరకు తేలిన మోసం రూ.2.91 కోట్లు కానీ ఫిర్యాదు చేయని బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని, వాస్తవ మోసం రూ.5 కోట్లు దాటుతుందని బాధితులు వాపోతున్నారు.

బాధితుల్లో ఆందోళన..

శివరంజినిబాయి అరెస్టుతో మరికొంత మంది బాధితులు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. ‘మా డబ్బులు మాకు వస్తాయా? నిందితుల ఆస్తులు అమ్మి అయినా సరే మాకు న్యాయం చేయండి’ అని బాధితులు వేడుకుంటున్నారు. ‘ఆర్‌బీఐ, సెబీ అనుమతి లేకుండా డిపాజిట్లు సేకరించడం నేరం. 5శాతం, 10శాతం, నెలవారి లాభం అంటే అది మోసమే. ప్రజలు అత్యాశకు పోయి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు. ఇలాంటి సంస్థల సమాచారం ఉంటే వెంటనే డయల్‌ 100కు కాల్‌ చేయండి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement