హోంవర్క్ తక్కువ.. ప్రాక్టికల్స్ ఎక్కువ
ముగిసిన ఉపాధ్యాయుల ఫిన్‌లాండ్ పర్యటన
అక్కడి అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్న గురువులు
జన్నారం: ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందిన ఫిన్‌లాండ్‌లోని బోధనా పద్ధతులను అధ్యయనం చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్లిన నలుగురు ఉపాధ్యాయులు ఐదు రోజుల ఎక్స్‌పోజర్ విజిట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ఒత్తిడి లేని అభ్యాసం, ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యత, విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలను నేరుగా పరిశీలించడం ద్వారా తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ఈ బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఫిన్‌లాండ్ విద్యా విధానం ప్రత్యేకతలు
ఫిన్‌లాండ్ విద్యా వ్యవస్థ ‘చదువు అంటే ఒత్తిడి కాదు, ఒక ఆనందకరమైన అనుభవం’ అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అక్కడ విద్యార్థులకు చాలా తక్కువ హోంవర్క్ ఉంటుంది, ట్యూషన్ల అవసరం అసలే ఉండదు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడం, పాఠశాలల్లో ఆటలకు, కళలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం, విద్యార్థుల సామర్థ్యాలను బట్టి వొకేషనల్ కోర్సులను ప్రోత్సహించడం వంటి అంశాలు ఫిన్‌లాండ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయి.
తెలంగాణ బృందం సందర్శించిన సంస్థలు
తెలంగాణ విద్యాశాఖ తరఫున వెళ్లిన ఈ బృందంలో జైపూర్ ఎంఈవో బి.శ్రీనివాస్, జన్నారం మండలంలోని కిష్టాపూర్ హైస్కూల్ ఉపాధ్యాయుడు దాముక కమలాకర్, పొనకల్ అక్కపల్లిగూడ ఎంపీఎస్ ఉపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా ఏమాయికుంట ఎంపీఎస్ ఉపాధ్యాయుడు బి.గంగయ్య ఉన్నారు. వీరు తమ పర్యటనలో హెల్సింకిలోని పలు పాఠశాలలు, యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి, టీచర్ ట్రైనింగ్ స్కూల్స్, వివిధ వొకేషనల్, టెక్నికల్ ఇనిస్టిట్యూషన్లు సందర్శించారు. అక్కడి ప్రొఫెసర్లతో సమావేశమై బోధనా పద్ధతులపై, శిక్షణ విధానాలపై లోతైన చర్చలు జరిపారు.
ప్రభుత్వానికి సమగ్ర నివేదిక
ఈ పర్యటనలో తాము నేర్చుకున్న అంశాలను, ఫిన్‌లాండ్ విద్యా వ్యవస్థలో తాము గమనించిన కీలక మార్పులను క్రోడీకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ముఖ్యంగా జీవిత నైపుణ్యాలను పెంపొందించే విలువలతో కూడిన అభ్యాసం, తరగతి గదుల్లో ప్రయోగాత్మక బోధనా పద్ధతుల అమలు వంటివి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయో ఈ నివేదికలో పొందుపర్చనున్నారు. ఈ పర్యటన ద్వారా అందిన అనుభవాలు భవిష్యత్తులో తెలంగాణ విద్యారంగంలో సృజనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయని ఉపాధ్యాయ బృందం ధీమా వ్యక్తం చేసింది.


