● విధుల్లో చేరిన కార్మికులు ● రోడ్డెక్కిన బస్సులు
మంచిర్యాలఅర్బన్: మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెరపడింది. ప్రభుత్వం, సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. దీంతో శనివారం తెల్లవారుజాము నుంచి బస్సులు ప్రారంభం కావడంతో ఉద్యోగులు, అత్యవసర ప్రయాణికలకు ఉపశమనం కలిగించింది. మూడు రోజులుగా 148 బస్సుల్లో కేవలం 62 బస్సులు మాత్రమే రాకపోకలు సాగించాయి. బస్సుల కొరత వల్ల ప్రయాణికులు ప్రయాసపడాల్సి వచ్చింది. సమ్మెతో మహిళలతో పాటు పురుషులకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. సమ్మెతో ఆర్టీసీ రోజుకు రూ.24 లక్షలపైన ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.
కార్మికుల సంబురాలు
తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల డిపోలో మూడు రోజులుగా సమ్మె చేపట్టిన కార్మికులు ప్రభుత్వ హామీతో సమ్మెను విరమించి శనివారం విధుల్లో చేరారు. స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. సమ్మెకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరికీ జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలి
దండేపల్లి: వరి ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఎక్కడ కూడా ధాన్యం కాంటా వేయడం లేదన్నారు. దీంతో యాసంగిలో వరి పండించిన రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలుగా పోసి నిరీక్షిస్తున్నారన్నారు. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారులు, పాలకుల వైఫల్యంతోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, నాయకులు రవీందర్, భూమన్న, శ్రీనివాస్, తిరుపతి, అజయ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.


