అయ్యో బాబు..!
రామకృష్ణాపూర్: కూలీ పనుల కోసం ఓ కుటుంబం పొట్ట చేతబట్టుకుని వలస వచ్చింది. తల్లిదండ్రులు భవన నిర్మాణ పనుల్లో నిమగ్నం కాగా.. కుమారుడు ఆడుకుంటూ మూడో అంతస్తు నుంచి పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గద్దెరాగిడి ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాగాడ్ జిల్లా సిరిగ్రామ్ గ్రామానికి చెందిన దాల్‌సింగ్, కిశోరి దంపతులు కూలీ పనుల నిమిత్తం ఐదు నెలల క్రితం కుటుంబంతో కలిసి ఈ ప్రాంతానికి వలస వచ్చారు. మేసీ్త్ర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గద్దెరాగిడి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల్లో శనివారం మధ్యాహ్నం దాల్‌సింగ్, కిశోరి దంపతులు నిమగ్నమై ఉన్నారు. వీరి కుమారుడు నితేష్(8) భవనం మూడో అంతస్తుపై ఆడుకుంటూ ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడిని వెంటనే మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తల్లిదండ్రుల కళ్లముందే ఘటన చోటుచేసుకోవడం అందరిని కంటతడి పెట్టించింది. బతుకు పోరాటం కోసం వచ్చిన కుటుంబానికి కుమారుడి మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


