అభివృద్ధి పనులకు రూ.130కోట్లతో ప్రతిపాదనలు
కనీవినీ ఎరుగని రీతిలో ఘాట్లు.. విశాలమైన రోడ్లు
ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక
చెన్నూర్: చెన్నూర్ గోదావరి నదీ తీరంలోని ఆలయాలు పుష్కర శోభను సంతరించుకోనున్నాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆలయాలు, వివిధ అభివృద్ధి పనులకు రూ.130.59 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. 2027 జూన్‌లో నిర్వహించే గోదావరి పుష్కరాలను టైర్‌వన్‌గా గుర్తించడంతో ఇప్పటి నుంచే పనులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. చెన్నూర్ ప్రాంత దేవాలయాలు, పుష్కర ఘాట్లకు విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, పుష్కర ఘాట్లు నిర్మిస్తారు. జాతీయ రోడ్డు నుంచి పుష్కర ఘాట్ల వరకు ఇరువైపుల పూలమొక్కలు, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా పెయింటింగ్‌లు వేస్తారు.
పనులు..
ఆలయాలకు పెద్దయెత్తున నిధులు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. పుష్కరఘాట్ ప్రాంతంలో గోదావరి మాత విగ్రహానికి రూ.50లక్షలు, రూ.కోటితో శివలింగం, గోదావరి తీర హనుమాన్ మందిర్‌కు రూ.50లక్షలు, చెన్నూర్ మదనం పోచమ్మ ఆలయానికి రూ.3 కోట్లు, జగన్నాథ ఆలయానికి రూ.75 లక్షలు, కల్యాణమండపం, డైనింగ్ హాల్‌కు రూ.4కోట్లు, గెస్ట్‌హౌస్ నిర్మాణానికి రూ.50 లక్షలు, కత్తరశాల మల్లికార్జున ఆలయానికి రూ.1.50కోట్లు, భక్తులు సేదదీరేందుకు భవన నిర్మాణానికి రూ.2 కోట్లు, శారద మండప నిర్మాణానికి రూ.50 లక్షలు, ఘాట్ వద్ద కేశఖండన షెడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు, అక్కెపల్లి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి రూ.కోటి, చెన్నూర్ మహాంకాళి దేవాలయానికి రూ.30 లక్షలు ప్రతిపాదించారు. పనులు పూర్తయితే ఆలయాలు కొత్త శోభను సంతరించుకుంటాయి.
భూ సేకరణ
చెన్నూర్ గోదావరి పుష్కరాల్లో భాగంగా జాతీయ రోడ్డు నుంచి పుష్కర ఘాట్ వరకు రోడ్డు వెడల్పు చేసేందుకు అధికారులు 4.21 ఎకరాల భూమి సేకరించాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో మార్కెట్ ధర ఎకరానికి రూ.12లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతోంది. రెవెన్యూ అధికారులు రూ.7.88 లక్షలుగా అంచనా వేశారు. రైతులను సంప్రదించి ధర నిర్ణయించే అవకాశం ఉంది.
శాఖల వారీగా నిధుల ప్రతిపాదనలు..


