రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం
ఇప్పటికే ఎల్లంపల్లి వద్ద ముర్రెల్ క్లస్టర్
మత్స్య సంపదకు కేంద్రంగా ‘ఎల్లంపల్లి’
రూ.కోట్ల వ్యయంతో ఏర్పాటు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలోని గుడిపేట శివారులో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు ఏర్పాటు కానుంది. ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపింది. త్వరలో టెండర్లు పిలిచి.. ఖరారైతే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. 100 నుంచి 150 ఎకరాల్లో దాదాపు రూ.80కోట్లకుపైగా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా 60శాతం నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆక్వా పార్కు నిర్మాణంతో రెండు రకాలుగా అభివృద్ధి జరగనుంది. పర్యాటకులకు వినోదం పంచేందుకు అత్యాధునిక వాటర్‌పార్కులతోపాటు మత్స్య సంపద అభివృద్ధి చేసే మౌలిక సదుపాయాల కేంద్రంగా నిలువనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా మత్స్యరంగ అభివృద్ధికి ఆక్వా పార్కుల ఏర్పాటులో భాగంగా రాష్ట్ర ప్రతిపాదనల మేరకే గుడిపేటలో ముర్రెల్ చేప ఉత్పత్తి, సంరక్షణ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పుడు రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో జిల్లా టూరిజం ప్రాంతంగానే కాకుండా జల మత్స్య సంపద, విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు వేదిక కానుంది. ఉపాధి అవకాశాలూ మెరుగుపడనున్నాయి. ఆక్వా పార్కులో వివిధ రకాల చేపల ప్రదర్శనకు ఆక్వా మ్యూజియం, వాటర్ గేమ్స్, ఆక్వా రైతులకు ఆధునిక పద్ధతుల అవగాహనకు శిక్షణ కేంద్రం, సందర్శకులకు షాపింగ్, హోటళ్లు, కెఫెటేరియాలు, మత్స్య సేవా కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు ఉంటాయి.
రూ.2.5 కోట్లతో ముర్రెల్ క్లస్టర్..
ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద రూ.2.5కోట్లతో ముర్రెల్ క్లస్టర్ ఏర్పాటు కానుంది. ముర్రెల్ చేప అంటే రాష్ట్ర చేప కాగా, దీనినే బొమ్మె చేపగానే కాకుండా కొరమీను, కొర్రమట్ట, మట్టగిడసగా పిలుస్తుంటారు. కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముర్రెల్ చేపల పెంపకాన్ని చేపట్టబోతోంది. 30 ఎకరాల్లో ముర్రెల్ క్లస్టర్‌లో ముర్రెల్ చేపల ఉత్పత్తి, మార్కెటింగ్ జరుగుతుంది. ముర్రెల్ క్లస్టర్‌తో మత్స్యకారులు, మహిళా స్వయం సహాయ సంఘాలకు లబ్ధి చేకూరనుంది. మొత్తంగా ఓ వైపు ముర్రెల్ క్లస్టర్ మరోవైపు ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు ఏర్పాటుతో మంచిర్యాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రానుంది.


