మౌనదీక్షలో పాల్గొన్న కార్మికులు
మంచిర్యాలఅర్బన్: సమస్యల పరిష్కారం కోసం టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మూడో రోజు శుక్రవారమూ కొనసాగింది. మంచిర్యాల డిపో వద్ద కార్మికులు నల్ల రిబ్బన్లు ధరించి మౌనదీక్ష నిర్వహించారు. అంతకుముందు ప్రాణత్యాగం చేసిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్‌గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమ్మెకు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
బస్సులు డిపోకే పరిమితం
డిపోలో 148 బస్సులు ఉండగా.. 62 అద్దె బస్సుల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. సంస్థ బస్సులు డిపోకే పరిమితం కాగా, అద్దె బస్సులు నడిచాయి. డీఎంతోపాటు మరో నలుగురు మినహయిస్తే మిగతా వారంతా సమ్మెలోనే ఉన్నారు. రెండు రోజులుగా మహిళలతోపాటు పురుషులకు ఉచి తంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులపై తాత్కాలిక కండక్టర్లను నియమించి పురుషులకు టికెట్ ఇష్యూ చేయించారు. హైదరాబాద్‌కు వెళ్లే 38 బస్సుల్లో మొత్తం లగ్జరీ, రాజధాని, లహరీ బస్సులన్నీ సంస్థవి ఉన్నా యి. మూడు రోజులుగా ఉద్యోగులు విధులకు దూ రంగా ఉండడంతో శుక్రవారం కూడా హైదారాబా ద్‌కు వెళ్లే సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. సొంత, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కొవ్వత్తుల ర్యాలీ
ఆర్టీసీ అమరవీరుడు శంకర్‌గౌడ్ మృతికి సంతాప సూచికంగా కార్మికులు శుక్రవారం రాత్రి మంచిర్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు వెళ్లి మళ్లీ బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.


