జన్నారం: కవ్వాల్ టైగర్ జోన్ కోర్ ఏరియా పరిధిలో విధి నిర్వహణకు అటవీశాఖ అధికారులు జంకుతున్నారు. టైగర్‌జోన్ నిబంధనల అమలులో ఉన్నతాధికారులు, స్థానిక ప్రజలతో సతమతం అవుతున్నారు. నిబంధనలు అమలు చేస్తున్న సిబ్బందికి స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండడంతో మనశ్శాంతి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌కు రావడానికి సిబ్బంది ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. పక్కనే ఉన్న మంచిర్యాల, చెన్నూర్ వంటి బఫర్ ఏరియా ప్రాంతాల్లో పని ఒత్తిడి తక్కువగా ఉండడంతో.. సస్పెండైన సిబ్బంది తిరిగి అటు వైపు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జన్నారం అటవీ డివిజన్‌లో బీట్, సెక్షన్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కొనసాగుతున్న సస్పెన్షన్లు..
సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో జాప్యంపై గత ఆరు నెలలుగా పదుల సంఖ్యలో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇప్పటికే సిబ్బంది కొరత ఉన్న జన్నారం అటవీ డివిజన్‌లో సస్పెన్షన్ల కారణంగా మరింత కొరత ఏర్పడింది. సస్పెండైన వారిని మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్ డివిజన్లకు పంపించడంతో జన్నారం డివిజన్‌లో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. ఉన్నత అధికారుల ఆదేశాలను పాటించడం, టైగర్ జోన్ నిబంధనలు అమలు చేయడం, స్థానిక ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకత సిబ్బందికి కత్తిమీద సాములా మారింది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా
జన్నారం అటవీ డివిజన్‌లో సిబ్బంది కొరత కొంతమేర ఉంది. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. సాధ్యమైనంత వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విధుల నిర్వహణ జరుగుతోంది. ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం ఇక్కడ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.
– రామ్మోహన్, ఎఫ్‌డీవో


