మంచిర్యాలఅగ్రికల్చర్: రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో మంచిర్యాల, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల వ్యవసాయ అధికారులు సురేఖ, విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఎఫ్‌పీఓల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ కల్తీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని నాణ్యమైన విత్తనాల వినియోగం వైపు మళ్లించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా పెసర, కంది, మినుము, శనగ, వేరుశనగ, నువ్వులు వంటి పంటలు సాగు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాల్లో విత్తనాల కొరత లేదని, సన్న, దొడ్డు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రెండు జిల్లాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని, ఇందుకు 50 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని, కనీసం 20 వేల క్వింటాళ్లను విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరాకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు వినియోగించేలా, పంట మార్పిడి చేపట్టేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ(టెక్నికల్), సహకార అధికారులు, ఏడీఏలు, ఎంఏఓలు, ఎఫ్‌పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.


