ఏకాగ్రతతో నైపుణ్యత సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఏకాగ్రతతో నైపుణ్యత సాధించాలి

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: నిరుద్యోగ యువత తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో నైపుణ్యత సాధించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారంలో భాగంగా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనుకబడిన తరగతుల, మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధి, కెరీర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వృత్తి విద్య కోర్సుల్లో ఆధునిక సాంకేతికతను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తుందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య, మంచిర్యాల నగర మేయర్‌ ధర్ని మధుకర్‌, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి దుర్గాప్రసాద్‌, మైనార్టీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి నీరటి రాజేశ్వరి, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

కూలీల సంక్షేమం దిశగా చర్యలు

భీమిని: ఉపాధి హామీ పథకం కూలీల సంక్షేమం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన భీమిని, కన్నెపల్లి మండలాల్లో పర్యటించారు. భీమిని మండలంలో ఉపాధిహామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. భీమినిలో ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్నారు. భీమిని తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాలు, భీమిని, కన్నెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సందర్శించి మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావుతో కలిసి ఉపాధిహామీ పనులు పరిశీలించారు. అనంతరం పీపీరావు ప్రాజెక్టును సందర్శించారు. ఎంపీడీఓలు గంగామోహన్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీఓలు రమ్య, తహసీల్దార్‌ బికర్ణదాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement