ఘాట్‌ ఏర్పాటయ్యేనా..! | - | Sakshi
Sakshi News home page

ఘాట్‌ ఏర్పాటయ్యేనా..!

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

కోటపల్లి: పుష్కరాల సమయంలో భక్తుల పుణ్యస్నానాలకు మండలంలో పుష్కరఘాట్‌ లేదు. ఇటీవల మండలంలోని పార్‌పల్లి ఎర్రాయిపేట గ్రామ సమీపంలోని గోదావరి నదీ తీరాన్ని అధికారులు పరిశీలించారు. కానీ ఇంతవరకు పనుల వైపు అడుగులు పడలేదు. దీంతో పుష్కరాల సమయానికి పనులు పూర్తవుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్‌పల్లి నదీ తీరంలో పుష్కరఘాట్లు ఏర్పాటు చేస్తే భక్తులకు ట్రాఫిక్‌ సమస్యలు తప్పుతాయి. పార్‌పల్లి ఎర్రాయిపేట సమీపంలోని గోదావరి నది పుష్కరఘాట్‌కు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. పంచకోశ ఉత్తరవాహిని గోదావరి నదీ తీరం పార్‌పల్లి వద్దనే ముగుస్తుంది. గోదావరి నది 63వ జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో ఏటా శివరాత్రి, శుభ కార్యక్రమాల సమయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. సమీపంలోనే కాలభైరవస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు 15కిలోమీటర్ల దూరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, 10కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉండడం గమనార్హం. పుష్కరఘాట్‌కు ఎంతమంది జనం వచ్చినా ఇబ్బందులు లేకుండా పార్కింగ్‌కు అనువైన స్థలాలు నదీ తీరంలోనే ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement