శ్రీరాంపూర్: బొగ్గు గని కార్మికుల నూతన ఒప్పందం కోసం వేతన కమిటీ వేయాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఆర్కే5 గనిపై కార్మికులతో మాట్లాడారు. వేతన ఒప్పంద కాల పరిమితి జూన్ 30తో ముగుస్తుందని, జూలై ఒకటి నుంచి కొత్త వేతన కాలపరిమితి అమలు కావాల్సి ఉందని తెలిపారు. ఈ వేతన ఒప్పందం కోసం ముందుగా కోల్ ఇండియా యాజమాన్యం కమిటీ వేసి వేజ్‌బోర్డ్‌ను తీర్చిదిద్దాలని తెలిపారు. ఇప్పటికే దీని ఏర్పాటులో జాప్యం జరిగిందని, దీన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టబోతున్నామని అన్నారు. వేతన కమిటీపై తక్షణమే కోలిండియా యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్‌రెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు భూంపల్లి రమేష్, మేకల స్వామి, కొమ్మ బాబు, ఫిట్ కార్యదర్శి కుమ్మరి చంద్రశేఖర్, నాయకులు కుంట రాజు, తెల్ల ప్రశాంత్, అరుణ్‌గౌడ్, చల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.


