దస్తురాబాద్: భర్త ఇంటి ఎదుట ఓ మహిళ బైఠాంచిన ఘటన మండలంలోని మున్యాల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన సుమలతకు 2024 ఫిబ్రవరి 9న దస్తురాబాద్ మండలం మున్యాల గ్రామానికి చెందిన కొప్పుల సత్తన్నతో వివాహమైంది. పెళ్లయిన నెలకే ఉపాధి నిమిత్తం సతన్న గల్ఫ్ దేశానికి వెళ్లాడు. ఆ సమయంలో సుమలత తన తల్లిగారింట్లో ఆరు నెలలు ఉండి డీఎస్సీ పరీక్షలు రాసి వస్తానని వెళ్లింది. రెండేళ్లయినా తిరిగా రాలేదని, ఇందుకు తన అత్త, మామే కారణమని ఆరోపించింది. వారు తనను ఇంటికి రాకుండా అడ్డు పడుతున్నారని తెలిపింది. కనీసం కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయకుండా అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన భర్త ఇంటి ఎదుట బైఠాయించినట్లు తెలిపింది. తనకు న్యాయం చేయాలని గ్రామ పెద్దలను వేడుకుంది. కాగా, స్థానికులు మద్దతు తెలుపగా సుమలత ఆందోళన కొనసాగిస్తోంది.


