అ‘దృశ్యం’ సినిమాను తలపిస్తోంది..! | - | Sakshi
Sakshi News home page

అ‘దృశ్యం’ సినిమాను తలపిస్తోంది..!

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

● తొమ్మిదిరోజులైనా ఆచూకీ లేని మల్లేశ్‌ ● డ్రోన్‌తో పరిశీలన, గ్రామస్తులతో గాలింపు

జన్నారం: వారం నుంచి ఓ వ్యక్తి కనిపించకపోవడం మిస్టరీగా మారింది. పోలీసులు, గ్రామస్తులు ఎంత వెతికినా అతడి ఆచూకీ దొరకడంలేదు. దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన గూడ మల్లేశ్‌ ఈ నెల 16న రాత్రి జన్నారం మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో పేకాడుతున్నాడు. దారి వెంట వెళ్లేవారి టార్చిలైట్లను చూసి పోలీసులనుకుని పారిపోయాడు. అప్పటి నుంచి అతడి సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ వస్తోంది. మరుసటి రోజు అతడి భార్య సుజాత జ న్నారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా, అతడితోపాటే పేకాడుతున్న మిగతా వారున్నా ఇప్పటివరకు మల్లేశ్‌ ఆచూకీ లభించలేదు. దీంతో స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. సుజాత ఫిర్యాదు మేరకు ఏసీపీ ప్రకాశ్‌ ఆదేశాలతో లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై ఉదయ్‌కిరణ్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు.

వివిధ కోణాల్లో దర్యాప్తు

మల్లేశ్‌ అదృశ్యం ఘటన అతడి కుటుంబ సభ్యుల కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌, డ్రోన్‌ కెమెరాలతో ఇదివరకే వెతకగా శుక్రవారం లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సైలు సురేశ్‌, తహసీనొద్దీన్‌, ఉదయ్‌కిరణ్‌ గ్రామస్తులతో కలిసి చెట్ల పొదలు, గోదావరి తీర ప్రాంతాల్లో గాలించారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో వెతకగా గోదావరి సమీపంలో ఆయన చెప్పులు కనిపించాయి. డాగ్‌ వాటిని పసిగట్టి గోదావరి నీటి వరకు వెళ్లి ఆగింది. దీంతో రిస్క్‌ టీంతో గోదావరి నీటిలో గాలించారు. డ్రోన్‌ కెమెరాతో పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. గ్రామస్తులతో కలిసి గోదావరి ప్రాంతంలోని చెట్లపొదలు, గుట్టలను గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో పంట చేలు, పొలాలకు విద్యుత్‌ తీగలు అమర్చి ఉంటే వాటికి తగిలే ప్రమాదముంది. ఆ కోణంలో పో లీసులు దర్యాప్తు జరిపితే బాగుంటుందని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ విషయంపై ఎస్సై ఉదయ్‌కిరణ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా, వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు డాగ్‌స్క్వాడ్‌, డ్రోన్‌లతో పరిశీలించామని పేర్కొన్నారు. గ్రామస్తులతో కలిసి పరిసర ప్రాంతాల్లో వెతికామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement