కై లాస్‌నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పోస్టు భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూ ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పోస్టు భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేయగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్, బ్యాంక్ ప్రత్యేకాధికారి రాజర్షి షా ఆధ్వర్యంలో టెస్కాబ్, నాబార్డు అధికారులు డీసీసీబీ బ్యాంక్‌లో ఇంటర్వ్యూ నిర్వహించగా ఐదుగురే హాజరయ్యారు. బ్యాంక్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అభ్యర్థుల నైపుణ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైతాంగానికి, సహకార సంఘాలకు వెన్నెముకగా నిలిచే డీసీసీబీ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో సీ ఈవో పాత్ర కీలకమని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో విశేష అనుభవం, పరిపాలనా దక్షత కలిగిన అధికారుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపా రు. పారదర్శకంగా అర్హుడిని ఎంపిక చేసి త్వరలోనే నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర సహకార బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వైకే రావు, నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ జాంబ్రే, చీఫ్ జనరల్ మేనేజర్ పి.మోహనయ్య తదితరులు పాల్గొన్నారు.
భూ ఆక్రమణకు యత్నించిన కొడుకుపై తల్లి ఫిర్యాదు
నెన్నెల: మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన పెళ్లి శ్రావణ్‌పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావణ్ తల్లి శారద పేరిట గ్రామ శివారులో ఎనిమిదెకరాల భూమి ఉంది. ఆమెకు నలుగురు కుమారులున్నారు. ఆ భూమిని పెద్ద కొడుకు శ్రావణ్ ఒక్కడే ఆక్రమించుకునేందుకు యత్నించగా తల్లి అడ్డుకుంది. దీంతో ఆమెను బెదిరించి చేనులోని పత్తి కట్టెను తొలగించి దున్నాడు. అతడి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గొడవ కేసులో ఇరువురి అరెస్ట్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి గుడిపేటలో ఇటీవల జరిగి న ఓ తగాదా కేసులో ఇరువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపేట ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుతున్న విద్యార్థులతో అదే ప్రాంతానికి చెందిన సుంకరి శ్రీకాంత్, దేవి అఖిల్ గొడవకు దిగారు. విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తూ చేతులతో కొట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


